Templates by BIGtheme NET
Home >> Cinema News >> దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? అంటూ నిలదీసాడు!

దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? అంటూ నిలదీసాడు!


తమిళ స్టార్ హీరో సూర్య తాను నటించిన ఆకాశమే హద్దుగా సినిమాని ఓటీటీ రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమిళ థియేటర్ల సంఘాలు తీవ్ర నిరసనను తెలిపాయి. పలువురు ఎగ్జిబిటర్లు సూర్యకు పబ్లిగ్గానే వార్నింగులు ఇచ్చారు. ఇలా అయితే థియేటర్లు అంతమైపోతాయని ఆవేదనను వ్యక్తపరిచారు. కానీ సూర్య మాత్రం ప్రస్తుత సందిగ్ధ పరిస్థితిలో వెయిట్ చేయడం సరికాదని ఓటీటీతో డీల్ మాట్లాడుకున్నారు. తన మాటకే కట్టుబడి ఆయన ఓటీటీ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో అది కాస్తా అంతకంతకు రచ్చవుతోంది.

సూర్య అంతటి పెద్ద స్టార్ ఓకే చెప్పినప్పుడు అతడిని అనుసరించేవారి సంఖ్య కూడా పెరిగింది. ఇటీవల నాని.. సుధీర్ బాబు నటించిన `వి- ది మూవీ` కూడా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఇది రిలీజ్ కానుంది. నాని స్ఫూర్తితో తెలుగులో అరడజను సినిమాలు అదే దారిలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

తాజాగా సూర్య యాక్టివిటీని వ్యతిరేకిస్తూ సింగం ఫేం హరి ఒక లేఖను రాయడం ఆసక్తిని కలిగించింది. ఇలా థియేట్రికల్ రిలీజ్ లేకుండా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే అసలైన ఎక్స్ పీరియెన్స్ ని అందమైన అనుహూతిని ప్రేక్షకులు మిస్సవుతారని ఆయన ఆవేదనను కనబరిచారు. సూర్య లాంటి స్టార్ ఒక డైరెక్ట్ OTT విడుదలను ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని.. దీనివల్ల మిడ్ రేంజ్ .. సెకండ్-లీగ్ హీరోలు కూడా తమ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయకుండా ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారని ఆవేదనను వ్యక్తపరిచారు. సూర్య తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు హరి. పెద్దతెర బ్లాక్ బస్టర్ల వల్లనే సూర్య పెద్ద స్టార్ అయ్యారని ఆయన గుర్తు చేయడం చూస్తుంటే కాస్త సీరియస్ గానే ఉంది పరిస్థితి. దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? అంటూ నిలదీసాడు సింగం హరి. ఈ ప్రశ్న కేవలం సూర్యకు మాత్రమే కాదు నానీకి ఇతర తెలుగు స్టార్లకు కూడా అన్వయించుకోవాల్సి ఉంటుందేమో!