సుశాంత్ పై సురేష్ రైనా ఎమోషనల్ పోస్ట్…!

0

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం యావత్ సినీ అభిమానిని బాధించింది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ మరణం తననెంతో బాధిస్తోందని మాజీ ఇండియన్ క్రికెటర్ సురేశ్ రైనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేస్తూ సుశాంత్ ను ఎప్పటికీ మరచిపోలేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ”బ్రదర్.. మా హృదయాల్లో నీవు చిరకాలం జీవించి ఉంటావు. మీ అభిమానులు మిమ్మల్ని అన్నింటికన్నా ఎక్కువ మిస్ అవుతారు. నీ విషయంలో పూర్తి న్యాయం చేకూరుతుందని నమ్ముతున్నాను. మన ప్రభుత్వం నాయకులపై నాకు ఆ నమ్మకం ఉంది” అంటూ సురేష్ రైనా పోస్ట్ చేసారు. ఈ వీడియోలో సుశాంత్ ఫోటోని చూపిస్తూ సుశాంత్ నటించిన ‘కేదార్ నాథ్’ చిత్రంలోని జాన్ నిసార్ పాట వినిపించడం గమనించవచ్చు. ఇక ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్ట్ ని ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేసారు రైనా.

కాగా ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ సింగ్ జూన్ 14న అనుమాస్పద రీతిలో మృతి చెందడంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట అందరూ భావించినా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మిస్టరీని తలపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులపైన.. ఇండస్ట్రీ మాఫియాపైనా.. నెపోటిజం పైనా.. అతని ప్రియురాలు రియా చక్రవర్తి పై కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేసారు. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసుఫై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.