Templates by BIGtheme NET
Home >> Cinema News >> త్వరలో పెళ్లి.. ప్రముఖ నటి ఆత్మహత్య

త్వరలో పెళ్లి.. ప్రముఖ నటి ఆత్మహత్య


తమిళ బుల్లి తెరపై స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటి వీజే చిత్ర నేడు తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకోవడం అందరికి షాకింగ్ గా ఉంది. నిన్న అర్థరాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర హోటల్కు తిరిగి వచ్చి కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈమె ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు తెలియరాలేదు. ఇటీవలే ఈమెకు చెన్నైకు చెందిన వ్యాపారవేత్తతో వివాహం ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం కూడా జరిగింది. మరి కొన్ని వారాల్లో వీరి పెళ్లి కూడా ఉంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈసమయంలో చిత్ర ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

కెరీర్ పరంగా విజే చిత్ర పీక్స్ లో ఉన్నారు. ఆమె ఆర్థికంగా చాలా బాగున్నారు. పారితోషికం విషయంలో ఆమె సినిమా స్టార్స్ తీసుకుంటున్నట్లుగా అందుకుంటున్నారు. అయినా కూడా ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా ఆత్మహత్య చేసుకునేంత కఠినంగా లేవు. అయినా కూడా ఎందుకు ఆమె ఇలా బలవన్మరణంకు పాల్పడ్డారు అనేది చూడాలి.

వీజే చిత్ర పెళ్లి విషయమై కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా బుల్లి తెర స్టార్ గా వెలుగు వెలుగుతున్న వీజే చిత్ర ఆత్మహత్య ఆమె అభిమానులకు కన్నీరు మిగిల్చింది. చిత్ర ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర మరణంపై తమిళ బుల్లి తెర పరిశ్రమ వర్గాల వారు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.