అనుష్క పేరు ఎందుకు ట్రెండవుతోంది?

0

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొత్త సినిమా ఇప్పుడేమీ విడుదల కావట్లేదు. అలాగే కొత్తగా ఆమె ఏ సినిమా చేయట్లేదు. సినిమాలకు సంబంధించి కానీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ.. అనుష్క గురించి కొత్త కబుర్లేమీ బయటికి రాలేదు. అయినా సరే.. బుధవారం మధ్యాహ్నం నుంచి అనుష్క శెట్టి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె పేరు ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణమేంటి అన్నది ఆసక్తికరం. అనుష్క సూపర్ హిట్ మూవీ భాగమతి హిందీ రీమేక్ దుర్గామతి ట్రైలర్ బుధవారమే రిలీజైంది. అది చూసిన తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా అనుష్క అభిమానులు ఉస్సూరుమన్నారు.

భూమి పడ్నేకర్ బేసిగ్గా మంచి నటే. కానీ అనుష్కతో పోలిస్తే ఆమె తేలిపోయింది దుర్గామతిలో. ట్రైలర్లో ఎక్కడా ఆమె అనుష్కను మ్యాచ్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మన జనాలంతా అనుష్క గురించి ట్విట్టర్లో చర్చ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. సినిమాకు హైలైట్గా నిలిచిన ఇంటర్వెల్ సీన్లో అనుష్క ఎంత బాగా చేసిందో.. భూమి ఎలా తేలిపోయిందో పోల్చి చూస్తున్నారు. ఏ పాత్రను ఎవరు చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి భాగమతి-దుర్గామతి సినిమాలే ఉదాహరణ అంటున్నారు. అనుష్క ఇండియాలో అరుదైన హీరోయిన్ అని.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ను మ్యాచ్ చేసేవాళ్లు లేరని పొగిడేస్తున్నారు అభిమానులు. అనుష్కకు సంబంధించి కొత్త కబురు ఏమీ లేకపోయినా.. ఆమె పేరు ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతోందంటే తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ అభిమానులు అనుష్కను ఆకాశానికెత్తేస్తున్నారు.