Templates by BIGtheme NET
Home >> GADGETS >> కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? 2020లో లాంచ్ అయ్యే టాప్-10 మొబైల్స్ ఇవే!

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? 2020లో లాంచ్ అయ్యే టాప్-10 మొబైల్స్ ఇవే!


కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ సంవత్సరం మీకోసం ఎన్నో టాప్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటిలో షియోమీ, వన్ ప్లస్, యాపిల్, రియల్ మీ ఇలా ఎన్నో బ్రాండ్లకు చెందిన అద్భుతమైన, స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫోన్లు ఉన్నాయి. వీటిలో టాప్-10 మొబైల్స్ ఇవే..

​1. వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్లు

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వన్ ప్లస్ తన 8 సిరీస్ ఫోన్లతో మార్కెట్లోకి రానుంది. అయితే ఈసారి కొంచెం కొత్తగా వన్ ప్లస్ 8 లైట్ పేరిట తక్కువ ధరలో కూడా ఒక స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. వాటికి సంబంధించిన ఫీచర్ల గురించి కూడా ఇప్పటికే ఎన్నో రూమర్లు మార్కెట్లో షికార్లు చేస్తున్నాయి. వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో మొబైల్స్ లో 120 హెర్ట్జ్, వన్ ప్లస్ 8 లైట్ లో 90 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించనున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పుకార్లు నిజమవుతాయో.. వన్ ప్లస్ కు ఈ విషయంలో వేరే ప్లాన్లు ఉన్నాయో తెలియాలంటే ఆ ఫోన్లు వచ్చేదాకా ఆగక తప్పదు మరి!

​2. షియోమీ రెడ్ మీ 9

షియోమీ రెడ్ మీ 9 కూడా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం(జనవరి-మార్చి)లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట చైనాలో, తర్వాత ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే సరిగ్గా ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి కూడా ఇప్పటివరకు ఎన్నో లీకులు వచ్చాయి. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్, 6.6 అంగుళాల నాచ్ డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

​3. శాంసంగ్ గెలాక్సీ ఎస్11 సిరీస్

శాంసంగ్ గెలాక్సీ ఎస్11 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఫిబ్రవరి 18న శాన్ ఫ్రాన్సిస్కోలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2020లో రానున్న టాప్ స్మార్ట్ ఫోన్లలో ఈ సిరీస్ ఫోన్లు కచ్చితంగా ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్11ఈ, గెలాక్సీ ఎస్11, గెలాక్సీ ఎస్11+ స్మార్ట్ ఫోన్లు ఈ సందర్భంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఫోల్డ్ 2ను కూడా శాంసంగ్ ప్రదర్శించే అవకాశం ఉంది. అమెరికాలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో, యూరోప్ లో ఎక్సోనిస్ 990 చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీటి డిజైన్ కూడా దాదాపు గెలాక్సీ నోట్ 10 తరహాలో ఉండే అవకాశం ఉంది.

​4. హువావే పీ40

హువావే పీ40 స్మార్ట్ ఫోన్ కూడా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం(జనవరి-మార్చి)లో యూరోప్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హువావే సీఈవో రిచర్డ్ యూ కూడా హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ కానున్నాయని తెలిపారు. ఈ ఫోన్ లో కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కూడిన 6.57 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే అందుబాటులో ఉండనుంది. కిరిన్ 990 ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. వెనకవైపు ఐదు కెమెరాలు కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కాకుండా హార్మొనీ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే అవకాశం ఉంది.

​5. రియల్ మీ ఎక్స్50

ఈ ఫోన్ విడుదలకు అయితే మీరు ఎన్నో రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనవరి 7న ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. రియల్ మీ నుంచి రానున్న మొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే కానుండటం విశేషం. ఇందులో 6.44 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, VOOC Flash Charge 4.0, ఆండ్రాయిడ్ 10, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు ఇప్పటికే లీకులు వచ్చాయి.

​6. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్

గెలాక్సీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు లైట్ వెర్షన్ గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ(AMOLED) స్క్రీన్ ను అందించనున్నట్లు సమాచారం. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 వెర్షన్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

​7. ఒప్పో ఫైండ్ ఎక్స్2

2019లోనే ఈ స్మార్ట్ ఫోన్ ను ఒప్పో ప్రకటించింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. సోనీ ఇప్పటివరకు ప్రకటించని కొత్త కెమెరా సెన్సార్ ను ఇందులో అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా డిస్ ప్లే కూడా 90 హెర్ట్జ్ లేదా 120 హెర్ట్జ్ డిస్ ప్లే అందించే అవకాశం ఉంది.

​8. రెడ్ మీ కే30 ప్రో

షియోమీ గత సంవత్సరం లాంచ్ చేసిన రెడ్ మీ కే30కి ప్రో వెర్షన్ గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. దీని గురించి వస్తున్న లీకులు నిజమైతే గనుక 2020 మార్చిలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 5జీని సపోర్ట్ చేసే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను అందించనున్నట్లు సమాచారం. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గల 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది.

​9. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్

పైన ఒక 10 లైట్ వచ్చింది కదా అనుకుంటున్నారా? అది శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్. ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్. 2020లో లాంచ్ కానున్న ఫోన్లలో అత్యధిక అంచనాలు ఉన్న ఫోన్లలో ఈ ఫోన్ కూడా ఒకటి. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజీ స్పెయిన్ లో ఈ మధ్య లైవ్ లోకి వెళ్లింది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ తో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం.

​10. ఐఫోన్ ఎస్ఈ2, ఎస్ఈ3

యాపిల్ కూడా ఈసారి తక్కువ ధరలో ఐఫోన్లను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ2, ఐఫోన్ ఎస్ఈ3 స్మార్ట్ ఫోన్లపై గత కొద్ది రోజులుగా చాలా వార్తలు వచ్చాయి. దీంతో ఈ సంవత్సరం దాదాపు ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో రెండు తక్కువ ధరవి కాగా, మిగతావి ఎప్పుడూ వచ్చే తరహాలోనే లాంచ్ అవుతాయని లీకులు వచ్చాయి.