కాలంతో పాటు టీ తాగే అలవాటు పెరుగుతున్నదే తప్పించి తగ్గట్లేదు. అందునా హైదరాబాద్ మహానగరంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీ అమ్మకం ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తోంది. అలాంటి టీ షాపుల్లో టీని మొదట్లో గాజు.. పింగాణి కప్పుల్లో ఇచ్చేవారు. తర్వాతి కాలంలో ప్లాస్టిక్ కప్పుల్లో ఇచ్చేవారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల పుణ్యమా అని పేపర్ కప్పుల్లో ఇస్తున్నారు.
అయితే.. పేపర్ కప్పుల్లో టీ తాగే అలవాటు ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పేపర్ కప్పుల్లో టీ తాగే అలవాటు అనారోగ్యానికి కారణమవుతుందని ఖరగ్ పూర్ ఐఐటీ పరిశోధకులు ఇటీవల తేల్చారు. పేపర్ కప్పుతో మూడుసార్లు 100మి.లీ. చొప్పున తాగటం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళతాయని తేలింది.
ఎందుకంటే.. 80 -90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడితో ఉన్న టీ ద్వారా 25వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరే అవకాశం ఉందని తేల్చారు. మరేం చేయాలన్న సందేహం వచ్చిందా? గతంలో మాదిరి.. అయితే గ్లాసు లేదంటే పింగాణి కప్పుల్లో టీ తాగటానికి మించింది మరొకటి లేదంటున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో? మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. పేపర్ కప్పుల్లో టీ తాగే అలవాటును వెంటనే మానుకోవటం మంచిది.