రివ్యూ : ఆహా కల్యాణం
రీమేక్ కథలంటే.. బాలు పాడిన పాట మన గొంతులో పలికించడమే! స్వరం, శృతి ఎంత బాగున్నా – బాలు పాటతో పోల్చి చూస్తారు. ఎంత గొప్పగా పాడినా – బాలుని పట్టుకోగలమా?! అందుకే రీమేక్ అంత రిస్క్ ఇంకోటి ఉండదు. కానీ.. కథ గురించీ, సన్నివేశాల గురించీ తలలు బద్దలు కొట్టకోవలసిన అవసరం లేదు. ఈజీగా అక్కడిది ఇక్కడ దింపేయొచ్చు అనుకొని ఇలాంటి కథలకు ఫిక్స్ అయిపోతారు. ఆహా కల్యాణం కూడా రీమేకే. బాలీవుడ్ సినిమా బ్యాండ్ బాజా బారాత్‌కి రీమేక్. అయితే ఈ సినిమా దురదృష్టమేంటంటే.. అదే బ్యాండ్ బాజా బారాత్‌ని నందిని రెడ్డి జబరద్‌దస్త్‌లో కాపీ కొట్టేసింది. అందుకే ఆహా కల్యాణం ఆహా అనిపించేలా తీసినా ఎవ్వరికీ ఆనదు. అది ఓహో అనుకొనేలా తీయాలి. అప్పుడే కాస్తో కూస్తో ఆకట్టుకోగలరు. మరి నాని బృందం ఆ పని చేయగలిగిందా? ఆహా కల్యాణం.. బ్యాండ్ బాజాకి మ్యాచ్ అయ్యిందా? లుక్కేద్దాం రండి.
శక్తి (నాని)కి చదువు అబ్బలేదు. పట్నం వచ్చింది.. చదువుకోవడానికి కాదు – ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. శ్రుతి (వాణీకపూర్) అలా కాదు. చదువు పూర్తి కాగానే ఇక్కడ గట్టిమేళం అనే వ్యాపారం.. చేయాలనుకొంటుంది. అంటే. పెళ్లిళ్లు చేయడం అన్నమాట. ఓ పెళ్లిలో శ్రుతిని చూసి ఇష్టపడతాడు.. శక్తి. తన వెంట పడడం మొదలెడతాడు. గట్టిమేళంలో నేనూ పార్టనర్ అవుతా.. అని అడుగుతాడు. ముందు నో చెప్పినా.. ఆ తరవాత ఒప్పుకొంటుంది. ఇద్దరూ కలసి గట్టిమేళం అనే కంపెనీ మొదలెడతారు. పెళ్లిళ్లమీద పెళ్లిళ్లు చేసి… గట్టిమేళం పేరు అందరికీ తెలిసేలా చేస్తారు. లాభాలూ వస్తాయి. స్థాయి పెరుగుతుంది. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకొనే క్రమంలో.. శారీరకంగానూ దగ్గరైపోతారు. ఆ తరవాత.. శక్తికి మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటుంది శ్రుతి. కానీ శక్తి మాత్రం శ్రుతితో ఇదివరకటిలా ఉండలేకపోతాడు. మన మధ్య జరిగిన సెక్స్ అనుకోకుండానే జరిపోయింది. బిజినెస్‌కీ రొమాన్స్‌కీ ముడిపెట్టడం వల్ల మన వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది.. అందుకే లైట్ తీస్కో అనిచెబుతాడు. దానికి శ్రుతి రియాక్షన్ ఏమిటి? ఆ తరవాత ఏమైంది? అసలు శక్తి ఆలోచనలు మారడానికి కారణం ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.
హిందీ సినిమా బ్యాండ్ బాజా బారాత్‌ని మక్కీకి మక్కీ దింపేయడానికి ట్రై చేశాడు దర్శకుడు. కొన్ని మార్పులు చేసినా.. అవేం కీలకమైనవి కావు. అందుకే దర్శకుడి ప్రతిభ అంచనావేయడం కష్టం. తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కథని మలచుకోవడంలో, సన్నివేశాలు యాడ్ చేసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. వెడ్డింగ్ ప్లానర్స్ అనే పాయింట్ మనకి పూర్తిగా కొత్త! అందుకే ఆ జోనర్ కథలోకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. కథంతా ఒకటే మూడ్ లో వెళ్తుంది. భారీ మలుపులూ, ట్విస్టులూ ఉండవు. అంత వరకూ సేఫ్. ఆడియన్ బుర్ర ఎవ్వరూ పాడుచేయడానికి ప్రయత్నించలేదు. కానీ మరీ ఇంత నిదానమైన కథ, కథనాలు…. బోర్ కొట్టిస్తాయి. సినిమా మధ్యలోంచి చూసినా కథ అర్థమైపోతుంది. ఎందుకంటే.. కథంతా అక్కడక్కడే తిరుగుతుంది కాబట్టి. ఇంట్రవెల్ బ్యాంగ్ మరీ తేలిపోయింది. అసలు అలాంటి చోట ప్రేక్షకుడిని బయటకు పంపాడంటే… కథ ఎంత నీరసంగా ఉందో అర్థమవుతుంది.
ఇంట్రవెల్ వరకూ డిటో… జబర్‌దస్త్! ఆరకంగా నందినిరెడ్డి ఈ సినిమాకి తీవ్ర అన్యాయం చేసింది. ఒకవేళ.. జబర్‌దస్త్ రాకముందు ఈసినిమా వచ్చుంటే ఇందులోని సీన్సన్నీ కొత్తగా కనిపించొచ్చు. కానీ ఆ అవకాశం లేకపోయింది. ఇంట్రవెల్ తరవాత కూడా కథలో అదే నిదానం. శ్రుతి అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలీదు. లైఫ్‌ని సీరియస్ గా తీసుకొనే శ్రుతి.. శక్తికి ఎలా లొంగిపోయిందో అర్థం కాదు. శక్తి, శ్రుతి కెమిస్ట్రీ ఈ సినిమాకి కీలకం. కెమిస్ట్రీ అంటే వాళ్లిద్దరూ అందంగా కనిపించడం కాదు. కలిసి ఉన్నప్పుడు చూడముచ్చటగా ఉండడం. కానీ నాని, వాణిల జంట… అంతగా ఆకట్టుకోలేకపోయింది. అది ఈ సినిమాకి ప్రధాన మైనస్. వాణి… నానికి అక్కలా కనిపించింది. ఆమె ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ చూడడం కష్టమే.
అయితే నాని మాత్రం ఎప్పట్లా చలాకీగా చేశాడు. అప్పుడప్పుడూ కమల్‌హాసన్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడు తప్ప… మిగిలిన చోట మంచి మార్కులే తెచ్చుకొన్నాడు. బట్లర్ ఇంగ్లీష్ మాటల్లో అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇక వాణితో అమ్మాయి లక్షణం ఒక్కటంటే ఒక్కటీ కనిపించలేదు. ఆ పాత్రకు అది సెట్టయింది కాబట్టి ఓకే. వచ్చే సినిమాలో వాణి ఎలా కనిపిస్తుందో ఏంటో…? సిమ్రాన్ కొద్దిసేపు కనిపిస్తుంది. ఆమె నటన కూడా ఫర్లేదు. వీళ్లు తప్ప ఏ పాత్రకీ ప్రాధాన్యం ఇవ్వలేదు దర్శకుడు. కథలో ఆస్కోప్ ఉన్నా ఉపయోగించుకోలేదు. దాంతో తెరపై ఎప్పుడూ నాని, వాణిలే కనిపిస్తారు.
ఇది యశ్‌రాజ్ ఫిలిమ్స్ సినిమా. తెలుగులో మొదటి ప్రయత్నం. నిర్మాణ విలువలు భారీగా చూపించడానికి ఇది భారీ సినిమా కాదు. నాని క్యాలిబర్‌కి, ఈ కథకి ఎంత కావాలో అంతే చేశారు. పాటల్లో హిందీ సినిమా ఛాయలు కనిపించాయి. ఫొటోగ్రపీ ఓకే. ఇలాంటి కథల్లో.. ఏసీన్ ఎక్కడ చూపించినా ఫర్లేదు. కాబట్టి ఎడిటర్‌కి కాస్త శ్రమ తగ్గింది. కొన్ని సంభాషణలు ఆకట్టుకొన్నాయి. అవన్నీ నాని నోటి నుంచే వచ్చాయి.
హిందీలో ఓ సినిమా విజయవంతం అయ్యిందంటే అది అక్కడి వాతావరణం, అక్కడి జనాల అభిరుచిపై ఆధారపడిన విషయం. అలాంటి కథని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు ఇక్కడి ప్రేక్షకుల స్థాయి, అభిరుచి గమనించాలి. వెడ్డింగ్ ప్లానర్స్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హిందీ సినిమా ప్రబావంలో ఉన్న సంగీతం, తెరపై తమిళ వాసనలు ఇవన్నీ ఇది తెలుగు సినిమా కాదేమో అన్న భావన కలిగిస్తాయి. జబర్ దస్త్ సినిమా కూడా ఆహా కల్యాణం… ఎఫెక్ట్ బాగా తగ్గించేసింది. చూసిన కథ… క్యారెక్టర్లు మార్చి తీసిన ఫీలింగ్ కలుగుతుంది. జబర్ దస్త్ కంటే ఈసినిమా ముందొస్తే, కొన్ని సమర్థమైన మార్పులు చేసుకోగలిగితే.. ఓహో అనకపోయినా.. ఆహా అనేలా ఉండును.
Aaha Kalyanam Review in English
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
