Home / REVIEWS / ఇద్దరమ్మాయిలతో : సమీక్ష

ఇద్దరమ్మాయిలతో : సమీక్ష

 

సినిమా:ఇద్దరమ్మాయిలతో
నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్..
దర్శకుడు :  పూరి జగన్నాథ్
నిర్మాత : బండ్ల గణేష్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
విడుదల తేదీ : 31 మే 2013

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో బన్ని సరసన అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు. అల్లు అర్జున్ కి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ‘దేశ ముదురు’ తర్వాత బన్ని – పూరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

సంజు రెడ్డి(అల్లు అర్జున్) స్పెయిన్ లో లీడ్ గిటారిస్ట్ గా తన మ్యూజిక్ ట్రూప్(శ్రీనివాస్ రెడ్డి, ఖయ్యూం, మరో ఇద్దరు అమ్మాయిలతో) తో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఇంతలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్(రావు రమేష్) కూతురైన ఆకాంక్ష(కేథరిన్) సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. అది కోమలి శంకరాభరణంకి(అమలా పాల్) సంబందించింది. ఆకాంక్ష ఉండబట్టలేక డైరీ చదవడం మొదలు పెడుతుంది. అందులో కోమలి – సంజు మధ్య జరిగిన లవ్ స్టొరీ గురించి ఉంటుంది. అదే సమయంలో ఆకాంక్షకి ఆ డైరీ లో ఉన్న సంజు తారసపడతాడు.

అతన్ని తనకి సైకాలజీ తెలుసనీ మొహం చూడగానే జాతకం చెప్పేస్తానని ఏడిపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఎంతో ఆసక్తి కరంగా చదువుతున్న టైములో డైరీ ముగిసిపోయి ఉంటుంది. అసలు ఏమైందో అర్థం కాక ఆకాంక్ష సంజు దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు సంజు చెప్పిన గతాన్ని విని ఎంతో షాక్ కి గురవుతుంది. అప్పటినుండి ఆకాంక్ష సంజు పై ఫీలింగ్స్ పెంచుకొని సంజుతో లవ్ లో పడుతుంది. అప్పుడే కథలో మెయిన్ ట్విస్ట్. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏందీ? అసలు సంజు ఎవరు? డైరీ అలా మధ్యలోనే ఆగిపోవడానికి గల కారణం ఏమిటి? చివరికి సంజు ఇద్దరమ్మాయిల్లో ఎవరితో సెటిల్ అయ్యాడు? అనేది తెలియాలంటే మీరు ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసి ఈ సినిమాలో వాడినన్ని కాస్ట్యూమ్స్ అల్లు అర్జున్ మరే సినిమాలోనూ వాడి ఉండడు. ‘రన్ రన్’, ‘టాప్ లేచిపోద్ది’ పాటల్లో మంచి డాన్సులతో ఆకట్టుకున్నాడు. ఇంట్రడక్షన్ చేజింగ్ సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసాడు. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ ఫైట్ లో అతని నటన చాలా బాగుంది. సెకండాఫ్ లో మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని ‘పాప రీట’ పాటకి చిరు స్టైల్లో డాన్సులు వేసి ఆడియన్స్ ని ఉర్రూతలూగించాడు.

అల్లు అర్జున్ తర్వాత సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కేథరిన్. కేథరిన్ సినిమాలో ఎంత గ్లామరస్ గా ఉందో, ఆమె నటన కూడా అంతే సూపర్బ్ గా ఉంది. ‘టాప్ లేచిపోద్ది’ పాటలో అల్లు అర్జున్ తో సమానంగా డాన్సులు వేసి అందరినీ మెప్పించింది. బన్ని – కేథరిన్ రొమాంటిక్ ట్రాక్ బాగుంది. ఈ సినిమాతో కేథరిన్ కి టాప్ హీరోల సరసన నటించే చాన్స్ లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అమలా పాల్ సినిమాలో కాస్త అమాయకత్వం ఉన్న పాత్రలో చాలా క్లాస్ గా ఉంది. స్పెయిన్ లో ట్రెడిషన్ డ్రెస్ లంగా ఓనిలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి కనువిందు చేసింది. అమలా పాల్ పాత్ర సినిమాకి చాలా కీలకం, అలాగే కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.

తనికెళ్ళ భరణి, నాజర్, ప్రగతి, తులసిలు తమ పాత్రలకు న్యాయం చేసారు. కేచ కంపోజ్ చేసిన ఇంటర్వల్, క్లైమాక్స్ ఫైట్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. సినిమా చివరి దశలో ఇచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. అలాగే అక్కడి నుండి సినిమా చాలా వేగంగా సాగుతుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త నిదానంగా అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలోనూ ఉండే హీరోయిజం, పంచ్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కాస్త తగ్గింది. అల్లు అర్జున్ పాత్రలో హీరోయిజం మిస్ అయ్యింది. అల్లు అర్జున్ అనగానే 6 పాటల్లో డాన్సులు ఇరగదీసి ఉంటాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ ఆయన కేవలం రెండు పాటలలోనే స్టెప్పులు వేయడం వల్ల అభిమానులు కాస్త నిరుత్సాహపడతారు.

పిడేల్ బ్రహ్మ గా బ్రహ్మానందం, గుడివాడ సైకో కృష్ణగా అలీలు పెద్దగా నవ్వించలేకపోయారు. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే కామెడీ ట్రాక్ ఇంకాస్త బాగుండాల్సింది. మెయిన్ విలన్ పాత్ర పోషించిన షవర్ అలీ పాత్ర పూరి జగన్నాథ్ ప్రతి సినిమాలోనూ ఉండే డాన్ పాత్రల్లానే ఉంది. సుబ్బరాజు పాత్ర కూడా సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు. ఫస్ట్ హాఫ్ లో పాటలు కూడా సరైన టైమింగ్ బెటర్ గా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రాఫర్ అమోల్ రాథోడ్ పనితనం బాగుంది. ముఖ్యంగా సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బాగా షూట్ చేసారు, కానీ కొన్ని సీన్స్ లో బ్యాక్ గౌండ్ లో ఉండే విజువల్స్ నటీనటులను డామినేట్ చేసినట్టుగా ఉంటాయి. ఎక్కువ భాగం సినిమాని బ్యాంకాక్, స్పెయిన్లోనే తీయడం వల్ల విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటల్లానే, సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా బాగుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో దేవీ ఆర్ఆర్ బాగుంది. శేఖర్ ఎడిటింగ్ ఓకే, కానీ సెకండాఫ్ ని వేగవంతం చేయడం కోసం సినిమాని కాస్త ట్రిమ్ చేయాల్సింది. బ్రహ్మ కడలి వేసిన సెట్స్ బాగున్నాయి.

పూరి జగన్నాథ్ ఎప్పటిలానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. కథ ఓకే, స్క్రీన్ ప్లే లో పూరి ప్లాన్ చేసుకున్న ట్విస్ట్ లు చాలా బాగున్నాయి కాకపోతే సినిమా కాస్త ఫాస్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. ఎప్పటిలానే డైరెక్షన్ బాగుంది కానీ ఈ సినిమాలో హీరోయిజం, పంచ్ డైలాగ్స్ విషయంలో పూరి పవర్ కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. కాబట్టి ఆయన ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడే అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ద్వారా ఓ కొత్త పూరి జగన్నాథ్ ని చూస్తారు. నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా సినిమాని చాలా రిచ్ గా తీసారు. ఆయన పెట్టిన ప్రతి రూపాయి చాలా గ్రాండ్ విజువల్స్ రూపంలో స్క్రీన్ పై కనిపిస్తాయి.

తీర్పు :

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చాలా స్టైలిష్ గా, కాస్త వైవిధ్యంగా తెరకెక్కించిన పూరి జగన్నాథ్ సినిమా. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్, స్టైలిష్ లుక్, కేథరిన్ గ్లామర్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. పూరి మార్క్ హీరోయిజం, పంచ్ డైలాగ్స్ లేకపోవడం, అలాగే కాస్త నిదానంగా సాగే సెకండాఫ్ ఈ సినిమాకి చెప్పదగిన మైనస్ పాయింట్స్. మొత్తంగా ఈ సమ్మర్లో చూడదగిన కూల్ అండ్ స్టైలిష్ ఫిల్మ్ ‘ఇద్దరమ్మాయిలతో’.

Iddarammayilatho Movie Review

Iddarammayilatho Movie English Review

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top