Templates by BIGtheme NET
Home >> Telugu News >> ‘ఆపరేషన్ తెలంగాణ’.. కమలనాథుల టార్గెట్ ఇదేనట

‘ఆపరేషన్ తెలంగాణ’.. కమలనాథుల టార్గెట్ ఇదేనట


వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న బీజేపీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల ముందు వరకు బీజేపీనా? అన్నవాళ్లే.. బీజేపీలోకి పోతే ఎలా ఉంటుంది? అన్న అంశంపై జోరుగా చర్చలు జరుపుతున్నారు. గ్రేటర్ లో అంచనాలకు మించిన ఫలితాలు.. గులాబీ బాస్ సైతం షాక్ తినేంతలా వెల్లడైన ఫలితాలు కాంగ్రెస్.. టీఆర్ఎస్ నేతల్లో కొత్త ఆలోచనలకు కారణమవుతోంది.

తెలంగాణలో పరిమితంగానే ఉన్న బీజేపీలోకి వలసలు ఎక్కువ కానున్నాయి. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. అయితే.. 2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ.. పార్టీలోకి వచ్చే నేతల విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వచ్చారు కదా అని అందరికి ఓకే చెప్పేస్తే.. తమకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. బలమైన నేతలు లేని ప్రాంతాలకు సంబంధించి.. ఎవరైనా ప్రజాదరణ నేతలు వస్తే వారిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో.. ప్రజల్లో వ్యతిరేకత లేని నేతల్ని మాత్రమే పార్టీలోకి ఎంట్రీ ఉంటుందన్న విషయాన్ని స్పష్టమవుతున్నారు.

రానున్న రోజుల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికతో పాటు.. త్వరలో ఎన్నికలు జరగనున్న వరంగల్.. ఖమ్మం.. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో వరుస వచ్చే ఎన్నికల్లో ఒక్కో అడుగు ముందుకు వేయటం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న యోచనలో కమలనాథులు ఉన్నారు. అదే సమయంలో పార్టీలోకి వచ్చే వారి విషయంలోనూ తొందరపడకూడదన్న నిర్ణయానికి వారున్నట్లు చెబుతున్నారు.

తమకు లైన్లోకి వచ్చిన నేతల హిస్టరీని చెక్ చేయటంతో పాటు.. వారికి ఎలాంటి హామీ ఇవ్వకుండా పార్టీలోకి చేరాలని కొందరికి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలోకి రావటంతోనే టికెట్ల హామీ అంటే సాధ్యం కాదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. క్లీన్ ఇమేజ్ తో పాటు.. రాజకీయ పలుకుబడి ఉన్న నేతలకు తొలత అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ రాములమ్మను పార్టీలోకి వచ్చేందుకు అంతా ఓకే కావటం.. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారిని తొలుత పార్టీలోకి తీసుకురావాలన్నదే బీజేపీ తాజా లక్ష్యమని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. కమలనాథుల తాజా టార్గెట్.. తెలంగాణలో అంతకంతకూ విస్తరించటమేనని స్పష్టం చేస్తున్నారు.