Templates by BIGtheme NET
Home >> Telugu News >> తెలుగు తమ్మళ్లలో నాటి స్ఫూర్తి రగిలిస్తోన్న చంద్రబాబు…!

తెలుగు తమ్మళ్లలో నాటి స్ఫూర్తి రగిలిస్తోన్న చంద్రబాబు…!


అవును! ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే కోరుకుంటున్నారు. గతంలో అంటే.. 2012లో చంద్రబాబు అనూహ్యంగా బస్సు+పాదయాత్ర చేశారు. దీనికి `వస్తున్నా మీకోసం` అనే పేరు పెట్టారు. ఏపీపై ఆయన పెట్టిన గురి.. పాశుపతాస్త్రంగా మారి.. విజయం అందించింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం చేకూర్చి పెట్టింది. అయితే.. ఇప్పుడు మరోసారి.. ఈ యాత్ర తెరమీదికి వచ్చింది. దాదాపు 100 సీడీలను పార్టీ నాయకులకు ఆయన పంపుతున్నారు. ఈ సీడీల్లో.. ఆ యాత్ర తాలూకు విశేషాలు.. ప్రజలతో తాను ఏవిధంగా మమేకం అయిందీ.. ప్రజలు తనను ఎలా రిసీవ్ చేసుకున్నదీ స్పష్టంగా ఉందని నేతలు చెబుతున్నారు.

వస్తున్నా మీకోసం.. యాత్ర జరిగి.. 10 సంవత్సరాలు అయింది. దీనిని పురస్కరించుకుని.. ఆదివారం.. హైదరాబాద్లో చంద్రబాబు కేక్ కట్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణ నుంచి కూడా.. అనేక మంది నాయకులు.. ముఖ్యంగా ఆ యాత్రతో నేరుగా సంబం ధం ఉన్న నాయకులు చంద్రబాబు నివాసానికి వెళ్లి.. ఆయనకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన గత జ్ఞాపకాలను మన నం చేసుకున్నారు. అప్పట్లో కూడా ప్రస్తుతం ఎంత పోటీ ఉందో అంతే ఉందని.. అయినప్పటికీ.. తాను చొరవ తీసుకుని 63 ఏళ్ల వయసులో యాత్ర చేశానని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మళ్లీ మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబుసీనియర్ నేతలకు చెప్పారు. అంతేకాదు.. ఇప్పుడు అవసరం ఎక్కువగా ఉందని.. ప్రజలు తమ కష్టాలు చెప్పుకొనేందుకు నేతల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అందుకే తాను పదే పదే.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని. ప్రజల్లో ఉండాలని చెబుతున్నానని. అయినా.. కూడా ఎవరూ తన మాట లెక్కచేయడం లేదని సీనియర్ల ముందు ఆవేదన వ్యక్తం చేశారట.

ఈ క్రమంలోనే వస్తున్నా మీకోసం.. యాత్ర కు సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీని సీడీలుగా రూపొందించి క్షేత్రస్తాయిలో నాయకులకు ఇవ్వనున్నారట. కనీసం.. ఆ సీడీలు చూసిన తర్వాత.. అయినా.. నాయకులు స్పందిస్తారని.. ప్రజల మధ్యకు వెళ్తారని.. చంద్రబాబు ఆశిస్తున్నా రు. వాస్తవానికి ప్రజల మధ్య ఉండాలని చంద్రబాబు చెబుతున్నా.. చాలా మంది నాయకులు లైట్ తీసుకుంటున్నారు. వీరిని మార్చడం చంద్రబాబు వల్ల కావడం లేదన్నది నిజమేనని సీనియర్లు కూడా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాను 2014లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్ని కష్టాలు పడ్డానో.. మరోసారి తెలపాలని.. దానిని చూసైనా.. తమ్ముళ్లు స్ఫూర్తిగా తీసుకుని.. వాళ్లంతట వాళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తారని.. చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే త్వరలోనే సీడీలను జిల్లాల స్తాయికి పంపిణీ చేయనున్నారట. మరి దీనినైనా స్ఫూర్తిగా తీసుకుని తమ్ముళ్లు ముందుకు సాగుతారో లేదో చూడాలి.