Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఓటరు కార్డ్స్ పై ఈసీ కీలక నిర్ణయం .. ఏంటంటే ?

ఓటరు కార్డ్స్ పై ఈసీ కీలక నిర్ణయం .. ఏంటంటే ?


భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అందరి ఓటరు గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఆధార్ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల ఫోటో ఐడెంటిటీ కార్డ్ లను పూర్తి డిజిటల్ పద్ధతికి మార్చనుంది.ఆధార్ కార్డుల్ని ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నట్లుగానే రాబోయే రోజుల్లో ఓటర్ ఫొటో ఐడీలకు కూడా డౌన్ లోడ్ సదుపాయం కల్పించి ఆ డిజిటల్ వెర్షన్ ను ఉపయోగించి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఓటరు కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయయని ఇంకొన్ని వర్గాలతో కీలక చర్చల అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి.

2021లో ఐదు రాష్ట్రాల్లో .. పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అసోం పుదుచ్చేరి లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు డిజిటల్ ఓటర్ ఐడీ కార్డులను తెచ్చేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి ఆటోమేటిక్ గా ఈ సౌకర్యం లభిస్తుంది. గతంలోనే ఓటరుగా నమోదు చేసుకుని ఉంటే వారు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త ఓటర్లు ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకునే సమయంలో వారు తమ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ కు లింక్ అయి ఉంటుంది. అప్పుడు సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎన్నికల అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎపిక్ ఐడీకి రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయని తెలిసింది. అందులో ఒక క్యూఆర్ కోడ్లో ఓటరు సమాచారం మరో క్యూఆర్ కోడ్లో మిగిలిన సమాచారం ఉంటుంది. కొత్త ఫార్మాట్ అందుబాటులోకి వస్తే సర్వీస్ ఓటర్లు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వారికి ఓటర్ కార్డులను ఇవ్వడం లేదు. ఇలాంటి విధానం రావడం వల్ల ఓటర్లకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఒక చోట నుంచి మరో చోటకు మారినప్పుడు తమ పేరును ఆ ప్రాంతంలో ఎన్ రోల్ చేయించుకోవడం సులభంగా ఉంటుంది.

పాత కార్డు తీసుకుని వెళ్లి కొత్త అడ్రస్కు సంబంధించిన పత్రాలు అందిస్తే అప్పుడు కొత్త అడ్రస్తో ఓటర్ కార్డు వచ్చేస్తుంది. 1993లో టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో మనదేశంలో తొలిసారి ఓటరు ఫొటో ఐడెంటిటీ కార్డుల విధానాన్ని తీసుకురావడం తెలిసిందే. తర్వాతి కాలంలో దాదాపు అందరికీ ఫొటోతో కూడిన ఓటరు ఐడీలను జారీ చేశారు. అయితే 27 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో డిజిటలైజేషన్ సంస్కరణను ఈసీ చేపట్టనుండటం గమనార్హం.