Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఫోటోలు చూసి మోడల్ అనుకునేరు.. బ్యాగులుకొట్టేసే బ్యాచ్

ఫోటోలు చూసి మోడల్ అనుకునేరు.. బ్యాగులుకొట్టేసే బ్యాచ్


ఫోటో చూశారా? మోడల్ కు ఏ మాత్రం తగ్గట్లేదు కదా? సంపన్న మహిళగా కనిపించే ఈ అమ్మాయి గురించి అసలు వాస్తవం తెలిస్తే నోట మాట రాదంతే. ఎందుకంటే.. ఈ మహిళ బ్యాగులు కొట్టేసే బాపతు. పేరు మోసిన షాపింగ్ మాళ్లు.. బ్యూటీ పార్లర్లను లక్ష్యంగా చేసుకొని అక్కడి వారి బ్యాగుల్ని లాఘవంగా కొట్టేయటంలో దిట్ట. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బెంగళూరు.. హైదరాబాద్ లోని ఆర్కెస్ట్రాలో సింగర్ గా పని చేస్తుంటుంది.

మరో షాకింగ్ నిజం ఏమంటే.. చోరీలు చేయటానికి కేవలం విమాన ప్రయాణాలు మాత్రమే చేసే ఈమె.. పదేళ్లుగా సింగర్ గా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేయటం ఆమె ప్రత్యేకత. చోరీలకు ముంబయి.. హైదరాబాద్.. బెంగళూరు.. కోల్ కతా మహానగరాల్లో ఆమె దొంగతనాలకు పాల్పడుతుంది. ఆమె నివాసం బెంగళూరుగా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు అర్చనగా చెబుతున్నారు. కానీ.. ఆమె తన పేర్లను తరచూ మార్చుకుంటుందని పోలీసులు చెబుతున్నారు.

2009లో సెంట్రల్ ముంబయిలోని ఒక ప్రముఖ మాల్ లో చోరీ జరగ్గా.. విచారణలో పోలీసులకు తొలిసారి ఈమె గురించిన వివరాలు లభ్యమయ్యాయి. ఆ తర్వాత నుంచి పలు మాల్స్ లోనూ.. బ్యూటీపార్లర్లలోనూ చోరీలు జరగటం.. అన్నింటిలోనూ కామన్ గా ఈ అమ్మగారు కనిపించటంతో ఆమె కోసం వెతుకులాట షురూ చేశారు.సీసీ కెమెరా పుటేజీలు.. సెల్ టవర్ లొకేషన్ లను విశ్లేషించి.. ఆమె ఫోటోల్ని సేకరించారు. అనంతరం.. ఆమె గురించి ఆరా తీయగా.. బెంగళూరు నివాసిగా తేల్చారు.తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించగా తాను 2009 నుంచి దొంగతనాలు చేస్తున్న విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.