1 నుండి 8వ తరగతి వరకు ఇంటి వద్దే పాఠాలు !

0

కరోనా లాక్ డౌన్ కారణంగా మూతబడిన పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఇకపై లేటు చేయకూడదు అని భావించి ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే .. ఒకటి నుంచి 8వ తరగతి పిల్లలను పాఠశాలలకు పిలవకూడదని ఏదైనా మార్గదర్శకత్వం వారికి ఇవ్వాలంటే వారి తల్లిదండ్రులను పాఠశాలలకు పిలవాలని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 21న హైస్కూల్ టీచర్లు అందరూ హాజరు కావాలని అలాగే ఇక 22 నుంచి అక్టోబరు 4 వరకు 50 శాతం మంది హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులు మాత్రం ఇంటిదగ్గరే విద్యనభ్యసించాలని 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి పాఠాలు 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి పాఠాలు ఆన్ లైన్ ద్వారా రివిజన్ చేయించాలని మార్గదర్శకాల్లో చెప్పారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఆన్ లైన్ విద్యకు సంబంధించి జారీచేసిన సూచనలు కొనసాగించాలన్నారు. గతంలో ఇచ్చిన ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ షెడ్యూల్ ఈ నెల 9 నాటికి ముగిసిందన్నారు.

కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈ నెల 5న పాఠశాలలు తెరవనందున వల్ల అక్టోబరు 5 వరకు ప్రత్యామ్నాయ కేలండర్ షెడ్యూల్ విద్యావారధి విద్యామృతం కొనసాగుతాయని చెప్పారు. 1 నుంచి 8 తరగతుల కోసం తయారు చేసిన షీట్లను అభ్యాస యాప్ లో ఉంచినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు వాటిని డౌన్ లోడ్ చేసి విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలని తెలిపారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు మార్గదర్శకత్వం తీసుకోవడానికి స్వచ్ఛంధ ప్రాతిపదికన మాత్రమే కట్టడి జోన్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను సందర్శించడానికి అనుమతించాలన్నారు. తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులు రాతపూర్వక సమ్మతి లేఖ తీసుకుని 21 నుంచి పాఠశాలలోకి అనుమతించాలని స్పష్టం చేశారు.