Templates by BIGtheme NET
Home >> Telugu News >> ‘బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకుంటేనే వారికి మనుషుల విలువ తెలుస్తుంది’

‘బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకుంటేనే వారికి మనుషుల విలువ తెలుస్తుంది’


మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగబాబు…నటుడిగా నిర్మాతగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. బుల్లితెరపై అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. తన ఇద్దరు పిల్లలను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక సొంతగా ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసిన మెగా బ్రదర్.. అన్ని విషయాలపై స్పందిస్తూ వస్తున్నాడు. కుటుంబ విషయాలు సినిమా సంగతులతో పాటు పలు సామాజిక అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం గురించి వివరించాడు. నిహారిక – వరుణ్ లు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం కొట్టడం లాంటివి చేశానని.. అది నేను చేసిన తప్పు అని.. ఆ టైమ్ లో మెచ్యూరిటీ లేక అలా చేశానని చెప్పుకొచ్చాడు. ‘వాళ్ళు సాధించినా సాధించకపోయినా.. సక్సెస్ కాలేదని నేను బాధపడను. నాకు పిల్లలు సంతోషంగా ఉండాలి అంతే’ అని వారిపై ప్రేమను తెలియజేశాడు.

ఈ క్రమంలో తాజాగా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడారు. ”పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రుల ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండాలి. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలను నిరుత్సాహపరచకూడదు. వెన్నుతట్టి ఉంటే వారు ఏదైనా సరే ఇష్టంగా కష్టపడతారు. అంతేగాని ఒక మాట ద్వారా ఫీల్ అయ్యేలా చేయకూడదు. మళ్ళీ అనేసి ఆ తరువాత ఈ మాత్రానికే ఫీల్ అవ్వాలా అనేది కూడా చాలా అనవసరం. నా కొడుకు వరుణ్ తేజ్ కూతురు నిహారిక విషయంలో నేను వారి నిర్ణయాలను తప్పుబట్టలేదు. ముందుగా వరుణ్ ని ఒక పోలీస్ ఆఫీసర్ గా చూడాలని అనుకున్నాను. నిహారిక డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే కోరుకున్నాను. కానీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపే ఇంట్రెస్ట్ చూపించారు. వారి మాటకు విలువ ఇవ్వాలి” అని నాగబాబు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. ‘పిల్లలు వాళ్ళ రూమ్ తో పాటూ బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడే వారికి పని మనుషుల యొక్క విలువ తెలుస్తుంది. ఇక పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా జీవించే శక్తి ఏర్పడుతుంది’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.