తేనె పేరుతో చైనా సుగర్ అమ్మకం.. ఆ మూడు తప్ప అన్ని బ్రాండ్లదీ అదే నిర్వాకం!

0

దాబర్, పతంజలి, జండూ వంటి ప్రముఖ సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీ అవుతోందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) శుక్రవారం వెల్లడించింది. ప్రముఖ బ్రాండ్లు విక్రయిస్తున్న తేనెల్లో కల్తీకి సంబంధించి తాము జరిపిన పరిశోధనల వివరాలను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి అందజేసినట్లు తెలిపింది. తేనె కల్తీ జరుగుతోన్న తీరును బయటపెట్టేందుకు తాము అనుసరించిన విధానాలన్నిటినీ సంస్థ అధికారులకు వివరించామని సీఎస్‌ఈ వివరించింది.

చైనా సంస్థలు తాము తయారు చేస్తున్న ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించాయి. గత కొన్నేళ్లలో ఈ ఉత్పత్తులు 11వేల టన్నుల వరకు మన దేశానికి వచ్చాయి. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా జరుగుతోందని, మన దేశంలో ‘ఆల్‌-పాస్‌ సిరప్‌’ పేరుతో లభిస్తుందని సీఎస్‌ఈ వివరించింది. చైనాతో పాటు ఉత్తరాఖండ్‌లోని జస్‌పుర్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీ నుంచి ఆ సిరప్‌ను సేకరించినట్లు తెలిపింది. ఈ సిరప్ కిలో రూ.53-68లకే లభిస్తోందని, పెద్ద మొత్తంలో ఆర్డరిస్తే ఇంతకన్నా తక్కువకే పొందుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని సీఎస్‌ఈ అధికారి అర్ణబ్ దత్తా అన్నారు.

జర్మనీకి చెందిన ప్రపంచ ప్రముఖ ల్యాబొరేటరీలో న్యూక్లియర్‌ మ్యాగ్నెటిక్‌ రిసోనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీ(ఎన్‌ఎంఆర్‌) పరీక్ష ద్వారా తేనె నమూనాలను పరిశీలించినట్లు తెలిపారు. ఎన్‌ఎంఆర్‌ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు మూడు మినహా చాలా బ్రాండ్లు విఫలమయ్యాయని సీఎస్‌ఈ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను దాబర్, పతంజలి, జండు సంస్థలు ఖండించడం గమనార్హం. సీఎస్ఈ పరీక్షల్లో సఫోలా, మార్క్‌ఫెడ్‌సోహ్నా, నేచుర్స్ నెక్టార్ మాత్రమే విజయమవంతమయ్యాయి.

ఎఫ్ఎస్ఎస్ఎఐ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే తమ ఉత్పత్తులున్నాయని వాదిస్తున్నారు. సీఎస్ఈ విడుదల చేసిన నివేదిక అవాస్తవమైందనీ, భారత సహజసిద్ధ తేనె పరిశ్రమను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ దాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె తమదని, ఇది 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్వట్టర్‌లో తెలిపింది.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్‌ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ తెలిపారు. శీతల పానీయాలపై 2003,2006లో చేపట్టిన పరిశోధనలో బయటపడిన దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామని తెలిపారు. అత్యంత ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు గుర్తించినదానికంటే చాలా ఎక్కువ హానికరమని పేర్కొన్నారు.