YS Jagan ఓ గజిని: గూగుల్‌లో దొరికిపోయారు.. ఎమ్మెల్యే రోజా వీడియో బయటపెట్టిన లోకేష్

0

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం జగన్‌ మాట్లాడిన మాటలకు లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌కు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. అధికార పక్ష సభ్యుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

చంద్రబాబు చర్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని దుయ్యబట్టారు. మీడియాలో ఫొటోలు వేయించుకునేందుకే ఇలా చేశారని చంద్రబాబును విమర్శించారు. దీంతో సీఎం జగన్‌ వ్యాఖ్యలకు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.


‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి గజినిలా నటించినా గూగుల్ మర్చిపోదుగా, ఇలా కొడితే అలా వచ్చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో చిందులు వేసి, అధికారం రాగానే నీతులు చెబితే ఎలా? జగన్ రెడ్డిది నోరు కాదు అబద్ధాల పుట్ట.’’ అని లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోడియం ముందు నిరసన చేయాలంటూ పురమాయించారని ఆ వీడియోలో ఉంది. ముఖ్యంగా ఆ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆ సభలో మంత్రి పీతల సుజాతను విమర్శిస్తూ ఎమ్మెల్యే రోజా ప్రదర్శించిన హావభావాలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆ విజువల్స్‌నే లోకేష్ తన వీడియోలో హైలెట్ చేశారు.