Templates by BIGtheme NET
Home >> Telugu News >> కేటీఆర్ కు కొత్త తిప్పలు.. కొత్త నినాదంతో మరో చేదు అనుభవం

కేటీఆర్ కు కొత్త తిప్పలు.. కొత్త నినాదంతో మరో చేదు అనుభవం


తెలంగాణలో తిరుగులేదనుకున్న పార్టీకి కొత్త టెన్షన్ షురూ అయ్యింది. మొన్నటివరకు తెలంగాణ అధికారపక్షాన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నోడు ఎవరున్నారన్న మాట ఇప్పుడు కాలం చెల్లినిదిగా మారింది. దుబ్బాక ఇచ్చిన ధైర్యాన్ని.. గ్రేటర్ మరింత పెంచి పెద్దది చేయటమే కాదు.. నువ్వు ప్రశ్నించు.. నీ వెనుక మేం ఉన్నామన్న ఓటుతో చెప్పిన ఓటరు మాట కమలనాథులకు కొత్త శక్తిని ఇస్తోంది. దీంతో.. గడిచిన ఆరేళ్లలో ఎప్పుడూ ఎదురుకాని సరికొత్త చేదు అనుభవాలు గులాబీ దళానికి ఎదురవుతున్నాయి.

ఏదైనా సంచలనం చేయాలంటే టీఆర్ఎస్ నేతలు మాత్రమే చేసేవారు. వారికి మాత్రమే ఆ దమ్ముధైర్యం ఉందన్న మాట ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడా స్థానాన్ని కమలనాథులు భర్తీ చేసేస్తున్నారు. నేతలు మొదలు కార్యకర్తల వరకు చెలరేగిపోతున్నారు. గులాబీ పార్టీకి కొత్త గుబులు పుట్టిస్తున్నారు. దూకుడుగా ఉండే కమలనాథుల తీరు అధికారపక్షానికి ఒక పట్టాన మింగుడుపడనిదిగా మారింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు వరుసగా రెండోసారి చేదు అనుభవం ఎదురైంది. జిల్లా పర్యటనకు వెళుతున్న ఆయన్ను.. ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకు వస్తే.. నిలదీస్తున్నారని చెప్పాలి.

తాజాగా తాను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయనకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. అప్పటివరకు మామూలు జనంలో ఉన్నట్లే ఉండి.. ఆయన రాగానే.. సమస్యల్ని ఆయన ముందు ఉంచి నిరసన వ్యక్తం చేయటం.. మెరుపుదాడి అన్న చందంగా.. కొత్త తరహా ఎత్తుతో చేస్తున్న బీజేపీ కార్యకర్తల తీరు అటు అధికారపక్షానికి.. ఇటు పోలీసులకు ఒక పట్టాన అర్థం కావట్లేదంటున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ను స్థానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మూన్నూరు కాపు సంఘ భవనాన్నిప్రారంభించటానికి వచ్చిన మంత్రిని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నలతో నిలదీశారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని మెరుపు ధర్నా చేశారు.

ఊహించని ఈ పరిణామానికి పోలీసులు అవాక్కు కాగా.. వారిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మెరుపు ధర్నాను తీవ్రమైనభద్రతా వైఫ్యలంగా వారు అభివర్ణించటం గమనార్హం.మంత్రిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి రెండు రోజుల ముందు ఖమ్మం జిల్లా పర్యటనలోనూ ఇలాంటి చేదు అనుభవమే ఆయనకు ఎదురైంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య.. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓపక్క కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ నేతలకు.. స్థానిక ఇష్యూల మీద బీజేపీనేతలు నిలదీస్తుండటంతో కేటీఆర్ అండ్ కోకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.