సోముకు అప్పుడే సెగ మొదలయ్యిందబ్బా

0

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏపీ శాఖకు కొత్త అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అప్పుడే సెగ మొదలైందట. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీర్రాజు… దూకుడుగానే వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీలోని ఇతర సీనియర్ల మాటలను అంతగా పట్టించుకోని ఆయన… తనదైన శైలి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్త కార్యవర్గమే సోముపై అసమ్మతికి బీజం వేసిందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

40 మందితో సోము వీర్రాజు ఏర్పాటు చేసిన కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు పదిమంది కార్యదర్శులు 5 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఈ కార్యవర్గంలోని కొందరు నేతలపైనే పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయట. అందులోనూ పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతన్న వారిని కాదని కొత్త వారిని అప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న వారిని కొత్త కార్యవర్గంలోకి తీసుకున్న సోము వ్యవహారసరళిపై ఇప్పుడు పార్టీ నేతలు మండిపడుతున్నారట. పార్టీలో మొదటినుండి కష్టపడుతూ పార్టీకి విధేయులుగా ఉంటున్న వారిలో చాలామందికి కొత్త కార్యవర్గంలో చోటు దక్కలేదట. గతంలో సుమారు 200 మందితో పార్టీ కార్యవర్గం ఉండేది. దాంతో పోల్చుకుంటే ఇపుడు సోము ఏర్పాటు చేసిన కొత్త కార్యవర్గంలోని 40 మంది హ్యాపీగానే ఉన్నారు. కానీ వివిధ పదవుల్లో నియమితులైన 40 మందిలో పార్టీలో మొదటినుండి పని చేస్తున్న నేతలకు చోటు దక్కలేదన్నదే అసలు సమస్యగా మారింది.

ఇప్పటికే ఎమ్మెల్సీ ఉన్న మాధవ్ నెహ్రు యువకేంద్రంలో కీలక పదవిలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిలను ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక చేసిన విషయంలో చాలా మంది మండిపోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారినే కార్యవర్గంలోకి తీసుకునే బదులు మరో ఇద్దరు సీనియర్లను తీసుకుని ఉండచ్చు కదా అనే లాజిక్ కు వీర్రాజు వద్ద సమాధానం లేదనే చెప్పాలి. మొన్నటి వరకు అధ్యక్షునిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ మద్దతుదారులకు కార్యవర్గంలో చోటు దక్కలేదనే ఆరోపణలు కూడా ఈ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.