13ఏళ్ళ ప్రస్థానం…ప్రతిక్షణం ప్రజాహితంతో ముడిపడిన ప్రయాణం..!!

0

జర్నలిజం అంటే ఒక బాధ్యత…జర్నలిజం అంటే ఒక కట్టుబాటు…జర్నలిజం అంటే కత్తిమీద సాము అన్న చైతన్యం తో ఎన్ టీవీ మొదలైంది.జనం.. వారి ప్రయోజనం.. జంటలక్ష్యాలుగా ఎన్టీవీ మొదలైంది.. వార్తలు ఎవరైనా చెప్తారు..కానీ.. ఎవరు ముందు చెప్తారు?ఎవరు ఖచ్చితంగా చెప్తారు..? ఎవరు ఉన్నదున్నట్టు చెప్తారు..? ఇదంతా కాదు.. ఎవరు అక్కడున్నది ఉన్నట్టు ప్రత్యక్షంగా జనానికి చూపిస్తారు? ఈ పని లాంచింగ్ నుంచే ఎన్టీవీ చేసింది..ప్రతక్ష్య ప్రసారాలని సరికొత్తగా నిర్వచించింది ఎన్ టీవీ లైవ్ వ్యాన్ల తో వార్తా ప్రసారాల స్థాయిని పెంచింది. ఈ ఒరవడి చానెల్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే మొదలైంది. పంజాగుట్ట ఫ్లై ఓవర్ దుర్ఘటన ని అందరికంటే ముందే అందించగలిగాం.అక్కడ మొదలైంది..అప్రతిహత ప్రయాణం..

అయితే ఎన్టీవీకి మొదటి నుంచి ఒక స్పష్టత వుంది. లైవ్ వ్యాన్లు కేవలం ఒక సాధనం మాత్రమే.. ప్రత్యక్షప్రసారాలు ఒక మాధ్యమం మాత్రమే..అసలు ప్రయోజనం సమాజక్షేమమే..అసలు లక్ష్యం ప్రజాహితమే..అందుకే అదే ఛానెల్ నినాదంగా మారింది. ప్రతిక్షణం ప్రజాహితమని చెప్తే చాలదు..చేతల్లో చూపాలి.. నినాదమొక్కటి సరిపోదు…నిదర్శనం కావాలి. ఎన్టీవీ పదమూడేళ్ళ ప్రయాణమంతా.. ఆ ప్రయత్నమే.. టాగ్ లైన్ లో చెప్పినది…టీవీప్రసారాల్లో ప్రతిఫలించాలి.. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి..ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలి..జనాభిప్రాయానికి ఎన్టీవీ ప్రతిబింబం కావాలి..అడుగడుగునా ఇదే ఆశయం. చేపట్టిన ప్రతి ప్రోగ్రామ్ కీ ఇదే ప్రామాణికం..అప్పటిదాకా న్యూస్ ఛానెల్ అంటే – ప్రజలకి చెప్పడమే.. ఛానెల్స్ చెప్పేదే ..జనం వినాలి.. చానెల్స్ చూపించేదే జనం తెలుసుకోవాలి. ఎన్టీవీ వచ్చాక ఈ తీరు మారింది. ప్రజలకు చెప్పడమే కాదు.. ప్రజలు చెప్పేది వినాలి…ప్రజాభిప్రాయానికి ఒక సమున్నత వేదిక కల్పించాలని ఎన్టీవీ సంకల్పించింది. జనం అంటే వోట్లే అనుకుంటారు నేతలు..ఆ వోటేసే ముందు జనం మనసులో ఏముందో తెలియజెప్పే బాధ్యత ఎన్టీవీ తీసుకుంది. ఒక్క నేతలపైనే – కాదు. ప్రభుత్వాల పైనా..ప్రభుత్వ కార్యక్రమాల పైనా..ఎప్పటికప్పుడు జనం నాడిని తెలుసుకోడానికి చేపట్టిన బృహతయజ్ఞమే ఎన్టీవీ సర్వేలు..

ఎన్టీవీ దృష్టిలో సర్వేలంటే కేవలం అంకెలు కాదు…పైకి కిందకి మారే గ్రాఫులు మాత్రమే కాదు..గెలుపోటముల ఊహాగానాలు కాదు..ఎన్టీవీకి సర్వేలంటే..జనహృదయ స్పందన .. ప్రజానాడి..పాలకులకి ఒక చురక పార్టీలకి ఒక హెచ్చరిక..ఛానెల్ కి ఒక పవిత్ర బాధ్యత.. ఈ భావనతోనే దేశంలో జాతీయ ఛానెళ్ళ కంటే ముందే ఎన్టీవీ సర్వే మహా యజ్ఞాన్ని తలపెట్టింది. మొదలైన దగ్గర నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో ఎన్టీవీది ఒక ప్రత్యేకమైన ముద్ర..సర్వేల నిర్వహణలో – ఫలితాల ఖచ్చితత్వంలో ఎన్టీవీది ఒక బెంచ్ మార్క్..ఒక్కసారి తప్ప ఈ పదమూడేళ్ళలో ఎన్టీవీ సర్వేలు పొరబడిన సందర్భాలే లేవు. ఇప్పుడు ప్రతిఎన్నకల ముందూ ఎన్టీవీ సర్వే అంటే పార్టీలకు ఒక లిట్మస్ టెస్ట్. ప్రజలకి ఒక చుక్కాని..ఎన్నికలకు ముందు ఏడాది నుంచే దశలు వారిగా సర్వేలు వెలువరించడం ఎన్టీవీకి ఆనవాయితీ. ఈ సర్వేలను చూసి వ్యూహాన్ని మార్చుకున్న పార్టీలున్నాయి..

విజయవకాశాలను మెరుగుపరుచుకున్న సందర్భాలునాయి..అందుకే ఒకసారి ఎన్టీవీ తొలి సర్వే నాటికి వున్న ప్రజాభిప్రాయం. ఎన్నికలు జరిగే నాటికి మారింది..ఇదీ ఎన్టీవీ సర్వేల సమర్ధత ఇదీ.. ఎన్టీవీ సర్వేలకి వున్న విశ్వసనీయత…ఎన్టీవీ సర్వేలు ఇవాళ ప్రజాభిప్రాయానికి ప్రామాణికంగా మారడం వెనుక..దశాబ్దం పైబడి ఎన్టీవీ యాజమాన్యం – సిబ్బంది పడిన శ్రమ – అకుంఠిత దీక్ష వున్నాయి.

ఈ ప్రస్థానంలో ఎన్టీవీ చేపట్టిన ఓ సర్వే – ఓ బృహత్ కార్యక్రమానికి పునాది వేసింది. వందకు పైగా వేదికలపై దేశభక్తిని పాదుకొల్పే సందర్భంగా మారింది. అదే మనదేశం-మనగీతం…

ఎంత మంది జాతీయ గీతం జనగణమన పూర్తిగా పాడగలరు? ఎన్టీవీ నిర్వహించిన సర్వేలో తేలిన వాస్తవాలు.. ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు మన దేశం మనగీతం పేరుతో భారీ కార్యకమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీవీ. జనగణమన ప్రాధాన్యం – చరిత్ర…ఇవన్నీ రేపటి తరానికి తెలియజేయాలన్న లక్ష్యంతో మనదేశం-మనగీతం కార్యక్రమం ప్రారంభమైంది. దాదాపు 105చోట్ల ప్రతి కార్యక్రమంలో కనీసం 50వేల మందితో కలిసి జనగణమన పాడటం ఈ మనదేశం-మనగీతం కార్యక్రమం.

పవిత్రయజ్ఙంలా భావించి ప్రారంభించిన మనదేశం-మనగీతం కార్యక్రమంలో స్వయంగా ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్రచౌదరి పాల్గొంటూ భావిపౌరులకు స్ఫూర్తినిచ్చారు. ఈ మహాకార్యక్రమం అనతికాలంలోనే లక్షలాదిమంది భావిపౌరుల్లో జాతీయతాభావాన్ని రగిలించింది. ఎవరి సహాయ సహకారాలు లేకుండా… కొనసాగించిన మహా యజ్ఞం ఇది.

జాతీయ గీతాలాపనలో ప్రతీ ఒక్కరూ స్వరం కలిపేలా.. అది మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా.. లక్షల మందిని ఈకార్యక్రమంలో భాగస్వాముల్ని చేసింది ఎన్టీవి. తెలుగు వారున్న ప్రతీ చోటకూ ఈ కార్యక్రమం చేరుకుంది.
తెలుగువాడిని తట్టి లేపింది. జాతీయగీతం ఆవశ్యకతను చాటి చెప్పింది. ఒక యజ్ఞంలా మన దేశం- మన గీతం ప్రోగ్రామ్ను నిర్వహించింది ఎన్టీవీ.

మొదట్లో ఇదేదో రొటీన్ ప్రోగ్రామ్ లాంటిదే అనుకున్నారు. మిగతా కార్యక్రమాల్లో బాగంగానే పరిగణించారు.
కానీ రోజులు గడిచే కొద్దీ మన దేశం మన గీతం ఒక ఉద్యమంలా మారింది. ఆంధ్ర దేశాన్ని కమ్మేసింది. ఒక నిష్కల్మషమైన లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం లక్ష్యం.. ప్రతీ విద్యార్థి… నిర్దేశిత గడువులో జనగణమన పూర్తిగా పాడేలా చేయడమే. ఎక్కడా వెనకడుగు వేయకుండా.. సామాజిక హితంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలుగు జాతి ఆశీర్వదించింది. జన హితమే లక్ష్యం.. జాతి హితమే ధ్యేయం.. జాతీయతా భావాన్ని రగిలించడమే ఆశయం. దేశ సమైక్యత సమగ్రతకు చిహ్నమైన జనగణమనకు వందేళ్లు నిండిన అరుదైన సందర్భంలో..ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం బాధ్యతగా భావించింది ఎన్టీవీ. ఇందులో లక్షల మంది విద్యార్థులు – నాయకులు – అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. కార్యక్రమం జరిగిన ప్రతీ చోటా అనూహ్య ఆదరణ వచ్చింది. వేల గొంతులు ఒక్కటై జాతీయ గీతాన్ని ఆలపించాయి.

105 చోట్ల – నగరాలు – జిల్లా కేంద్రాలతో పాటు పొరుగున ఉన్న బెంగళూరులోనే కాదు…విదేశాల్లోనూ మన దేశం- మన గీతం కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. ఇక రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన మన దేశం- మన గీతం సరికొత్త చరిత్ర సృష్టించింది. లక్ష మందికి పైగా విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని అతిరథ మహారధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశం మన గీతం కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా…ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రేక్షకుల్లోనూ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీవి. వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నా ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగలేదు. లాభాపేక్ష లేకుండా… సామాజిక హితమే ధ్యేయంగా… లక్షల మందితో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఓ మార్గదర్శిగా నిలిచింది ఎన్టీవీ.

మన దేశం మన గీతం నిర్వహించి ప్రసార సాధనాల చరిత్రలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ట్రెండ్ తో పాటు.. ట్రెడిషన్ కి కూడా సమప్రాధాన్యమిస్తూ సాగుతోంది ఎన్టీవీ ప్రయాణం. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది.

ధార్మిక సమ్మేళనాలు – ఆధ్యాత్మిక ప్రవచనాలు – కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు – ఆధ్యాత్మిక సుమగంధాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ – భక్తి టీవీ పదేళ్లుగా కలసి అడుగులేస్తున్నాయి. ఎన్టీవీతో పాటుగానే ధర్మ నిర్మాణ కార్యాచరణే ధ్యేయంగా భక్తి టీవీ కూడా తన ప్రయాణం మొదలు పెట్టింది. ఈ దశాబ్ద కాలంలో సనాతన ధర్మ సారధిగా ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచింది భక్తి టీవీ. పీఠాధిపతులు – మఠాధిపతులు – ఆధ్యాత్మిక గురువులతో అతి పెద్ద ధార్మిక సమ్మేళనాలను నిర్వహిస్తూ.. ధర్మ పరిరక్షణలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది.

భక్తి టీవీ ప్రారంభం లక్ష్యం లాభాపేక్ష కాదు. ఒక పవిత్ర ఆశయంతోనే భక్తి ఛానల్ ప్రారంభమైంది. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగుల్ని నింపడంతో పాటు..మరుగున పడిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాల్ని సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్టతో నిర్వహిస్తోంది. భారతం – భాగవతం – రామాయణ – ఇతిహాసాల్ని – పురాణాలపై కథనాలు – కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ పురాణాల ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తోంది. చాగంటి కోటేశ్వరరావు – గరికపాటి నరసింహారావు వంటి ఆధ్యాత్మిక వేత్తలతో ప్రవచనామృతాన్ని పంచుతోంది. ఈ ప్రయాణంలో భక్తి కాంతుల్ని వెదజల్లేలా… కోటి దీపోత్సవం అనే మహాత్కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఏటా భక్తి టీవీ – ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం…దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

పరమ పవిత్రమైన కార్తీక మాసాన.. వేలాది మంది భక్తులు ఒక్క చోట చేరి – లక్షలాది దీపాలను వెలిగించే అద్భుత – అద్వితీయ – ఆధ్యాత్మిక సమాగమమే కోటి దీపోత్సవం. పీఠాధిపతులు – గురువులు – ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్క చోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. 2012లో శృంగేరీ జగద్గురు శ్రీభారతీ తీర్థ మహాస్వామి దివ్యాశీస్సులతో లక్ష దీపోత్సవంగా మొదలైన ఈ ఆధ్యాత్మిక క్రతువు… అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచింది. లక్ష దీపోత్సవం.. 2013లో కోటి దీపోత్సవంగా మారి కోటి కాంతుల్ని వెదజల్లింది. ఆ అద్భుతాన్ని ఎన్టీవీ – భక్తి టీవీల.. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హైందవులు వీక్షించారు. అప్పటి నుంచి ప్రతియేటా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా .. కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది.

ఈ వేదికపై కోటి దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు – పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు – ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు – వివిధ పుణ్య క్షేత్రాల ఉత్సవ మూర్తులు – స్వామి వార్లు – అమ్మవార్ల కళ్యాణోత్సవాలు.. ప్రతీ రోజూ పండగలా హైందవ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా మారింది కోటి దీపోత్సవం.

సామాజిక – ఆధ్యాత్మిక బాధ్యతను భుజానికెత్తుకున్న ఎన్టీవీ – భక్తి టీవీ.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నాయి. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. సామాజిక బాధ్యత – ఆధ్యాత్మిక భావనతో పాటు – వార్తల ప్రసారంలో విభిన్నత ఎన్టీవీ డీఎన్ ఏ లో ఉంది.

చుట్టూ జరిగే సంఘటనలే కాదు.. రాజకీయ ఎత్తుగడలు…. నేతల వ్యూహాలు… లోతైన విశ్లేషణలు… చర్చలు… ప్రజాభిప్రాయాలు…. జాతీయాంశాలు… ప్రపంచ పరిణామాలు… వినోద… విజ్ఞాన కార్యక్రమాలు… టెక్నాలజీ అప్ డేట్స్…. ఇలా అన్నింటి మీదా లోతైన కథనాల్ని అందిస్తోంది ఎన్టీవీ. సెలబ్రిటీల ఇంటర్వ్యూలే కాదు.. సామాన్యుడి బతుకుపోరాటాన్ని కూడా సజీవంగా ఆవిష్కరిస్తోంది. మన చుట్టూ జరిగే మోసాల్ని వివరిస్తూ.. బీ అలర్ట్ అంటూ మేల్కొలుపుతోంది. సమకాలీన రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలలో లోతైన – నిఖార్సైన విశ్లేషణలను స్టోరీ బోర్డ్ గా ఆవిష్కరిస్తోంది. 12 డీఎస్ ఎన్ జీ లతో భారత మీడియా చరిత్రలోనే విన్నూత్నంగా మొదలైన ఎన్టీవీ.. 13వసంతాలుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతోంది. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలతో తాను నమ్మిన ప్రజాహితాన్ని కాంక్షిస్తూ నిత్యం ముందుకు సాగుతూనే ఉంటుంది.

అటు సోషల్ మీడియాలో కూడా శరవేగంగా దూసుకుపోతోంది ఎన్టీవీ. యూ ట్యూబ్ లో రచన టెలివిజన్ కు 8.6 మిలియన్ల సబ్ స్క్రైబర్లున్నారు. ప్రతిరోజు కోటి 40లక్షలమంది రచన టెలివిజన్ కార్యక్రమాలను యూ ట్యూబ్ లో చూస్తున్నారు. సోషల్ మీడియాలో 2.2 మిలియన్ల సబ్ స్క్రైబర్లుంటే – రోజుకు 4.1 మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇక రచన టెలివిజన్ వెబ్ సైట్ కి 51లక్షలమంది సబ్ స్క్రైబర్లుంటే – 20 లక్షలమంది రోజూ సందర్శిస్తున్నారు.

ఎన్టీవీ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిందంటే.. అందుకు కారణం జనం ఆశీస్సులే. నిజానికి రంగులు పూయకుండా – కత్తెరలు వేయకుండా ఉన్నదున్నట్టు ప్రజలకు అందించాలన్న ఒక సామాజిక బాధ్యతతోనే ప్రత్యక్ష ప్రసారాలను మా శైలిగా మార్చుకున్నాం.. పదమూడో వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు.. అవిశ్రాంతంగా కృషి చేస్తాం. వేగం – విశ్వసనీయతే ఆయుధంగా.. తెలుగునాట.. ప్రతిక్షణం ప్రజాహితం కోసం నిలబడతామని హామీ ఇస్తున్నాం.