Templates by BIGtheme NET
Home >> Telugu News >> అధికారిని ఇన్ని తిట్లు తిట్టటమా? వైరల్ గా ప్రకాశం జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్ల దండకం

అధికారిని ఇన్ని తిట్లు తిట్టటమా? వైరల్ గా ప్రకాశం జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్ల దండకం


అధికారులు తప్పులు చేసి ఉండొచ్చు. వారికి బుద్ధి చెప్పే క్రమంలో మందలించటం నేతలు చేస్తుంటారు. కానీ.. దేనికైనా హద్దు ఉంటుందన్నది మర్చిపోకూడదు. తనకున్న అధికార బలాన్ని అధికారిపై జులుం రూపంలో ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారుతోంది. రెవెన్యూ అధికారి ఒకరు సరిగా పని చేయటం లేదని.. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ ఫైర్ కావటం వీడియోలో కనిపిస్తోంది.

చుట్టూ తన మంది మార్బలాన్ని పెట్టుకొని.. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ.. బూతులు తిట్టేస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది. అధికారికి తాను వార్నింగ్ ఇచ్చే విషయాన్ని వీడియో తీయిస్తున్న వైనం చూస్తే.. ఎమ్మెల్యేగా తానేమీ చేసినా ఫర్లేదన్నట్లుగా వ్యవహరశైలి ఉండటం గమనార్హం. సదరు అధికారి పని తీరు మీద ప్రజలు కోపంగా ఉన్నారంటూ.. ‘నిన్న కొడతారు.. నువ్వు కనిపిస్తే కొట్టేలా ఉన్నారు.. కచ్ఛితంగా కొడతారంటూ’’ అదే పనిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. కొట్టాలన్న సందేశాన్ని సదరు ఎమ్మెల్యే ఇస్తున్నట్లుగా సదరు వైరల్ వీడియో ఉందని చెప్పక తప్పదు.

ప్రజల్ని పీడిస్తున్నావు నువ్వు అంటూ రాయలేని బూతులు తిట్టేసిన సదరు ఎమ్మెల్యే.. ఆ అధికారిని వెంటనే సెలవు పెట్టి వెళ్లాలని ఆదేశించటం విస్తుపోయేలా చేస్తోంది. నిజంగానే.. సదరు అధికారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉంటే.. ఉన్నతాధికారుల వద్దకు విషయాన్ని తీసుకెళ్లి.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా.. చుట్టూ మనుషుల్ని పెట్టుకొని దబాయించటం.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేయటేమేమిటన్న సందేహం రాక మానదు.

ఇలాంటి ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగేలా చేస్తుందని చెబుతున్నారు. అధికారులపై చులకన భావం కలిగేలా చేస్తుందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం మనస్తాపానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. బిహార్ రాజకీయాల్ని గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఇలాంటి ఉదంతాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన అధికారిని వదిలేయాల్సిన అవసరం లేదు. అలా అని.. ఎవరి హద్దుల్లో వారు ఉండాలే కానీ.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టిపోయేటం సరికాదంటున్నారు.