Templates by BIGtheme NET
Home >> Telugu News >> మోడీనా మజాకానా? హైదరాబాద్ టూర్ లో భలే ట్విస్టు

మోడీనా మజాకానా? హైదరాబాద్ టూర్ లో భలే ట్విస్టు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు చాలా భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ మాత్రం అంచనా వేయలేని విధంగా ఉంటుందని చెప్పాలి. ఒక పరిశోధనకు సంబంధించి ఒక ప్రైవేటు కంపెనీని దేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా పర్యటించటం ఇదే తొలిసారి అవుతుందేమో? కరోనా లాంటి అరుదైన సందర్భం కావటంతో ఈ పర్యటనను అర్థం చేసుకోవచ్చు. కాకుంటే.. ముందస్తు ప్రకటన లేకుండా రోజు ముందు ప్రకటనను విడుదల చేయటం ద్వారా తన పర్యటనను హాట్ టాపిక్ గా మార్చారు మోడీ.

కోవిడ్ వ్యాక్సిన్ మీద పని చేస్తూ.. ఉత్తమ ఫలితాల్ని నమోదు చేస్తున్న భారత బయోటెక్ సంస్థను సందర్శించారు ప్రధాని. హైదరాబాద్ తో పాటు.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్.. ఫుణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ లోనూ ఆయన పర్యటించారు. కోవిడ్ వ్యాక్సిన్ మీద పరిశోధనలు చేస్తూ.. చివరి దశలో ఉన్న వేళ.. ప్రధాని స్వయంగా పర్యటించటంతో ఈ మూడు పరిశోధక సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పాలి.
తన హైదరాబాద్ పర్యటనలో భారత బయోటెక్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలను కలవటంతో పాటు.. వ్యాక్సిన్ పరిశోధనలపై వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల్ని ఆయన అభినందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ఒకటి చేశారు. జీనోమ్ వ్యాలీని సందర్శించిన వేళ.. తన పర్యటన చివర్లో మోడీ తన మార్క్ ట్విస్టును ఇచ్చారు.

భారత్ బయోటెక్ సంస్థ నుంచి హకీంపేట విమానాశ్రయానికి వెళుతున్న వేళ.. సంస్థ బయటకు రాగానే.. తన వాహన శ్రేణిని ఆపారు. కారు దిగిన మోడీ.. కాస్త దూరంలో మీడియా ప్రతినిధులను చూసి అభివాదం చేశారు. కారు దిగి ఇరవై అడుగులు వేసి.. మీడియాను పలుకరిస్తున్నట్లుగా పలుకరించి.. వెళ్లిపోయారు. ఒకదశలో.. ఆయనే మీడియా వద్దకు స్వయంగా వస్తారని భావించినా.. అలాంటిదేమీ లేకుండా.. చేతులు ఊపి వెళ్లిపోయారు. తన పర్యటనలో ఏదో ఒక మార్కు ప్రదర్శించకుండా మోడీ ఎందుకు వెళతారు చెప్పండి.