Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి శుభవార్త.. బస్సులు మొదలయ్యాయి

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి శుభవార్త.. బస్సులు మొదలయ్యాయి


ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. బస్సు సర్వీసుల మొదలయ్యాయి. అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. పరిస్థితిని బట్టి సర్వీసుల్ని పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్, వీలైనంత వరకు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఐదు నెలలుగా హైదరాబాద్‌కు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ట్రావెల్స్ బస్సులకు లైన్ క్లియర్ కావడంతో మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌, తెలంగాణకు ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్‌ ఇంకా స్పందించలేదు. సర్వీసుల పెంపునకు టీఎస్‌ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగే ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్‌ ఆర్టీసీ తెగేసి చెబుతోంది. దీంతో ఆర్టీసీ సర్వీసులు నడటపంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.