Templates by BIGtheme NET
Home >> Telugu News >> హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలనుందా?

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలనుందా?


కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న రోజుల్లో మెట్రో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరిణామాలతో దేశరాజధాని ఢిల్లీలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే కరోనాకు ముందు వరకు హైదరాబాద్ లో రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో చదరపు అడుగుకు ఏకంగా రూ.3వేల నుంచి అత్యధికంగా గచ్చిబౌలిలో రూ.7వేల ధర పలికింది. డబుల్ బెడ్ రూం కు కనీసం రూ.75 లక్షల నుంచి రూ.1కోటి వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో మధ్యతరగతి జనాలు అపార్ట్ మెంట్ ఆశలను వదిలేసుకునేవారు. ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. రియల్ వ్యాపారులు బిల్డర్లు నిలువునా మునిగిపోయారు.

కరోనా మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రాజెక్టులు వలస కూలీలు లేక ఆగిపోయాయి. చాలా మంది డిమాండ్ లేక ప్రాజెక్టులను ఆపేశారు. పూర్తికి మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. కార్మికుల కొరత.. ఆర్థిక వనరుల లేమి ఉద్యోగ భద్రత లేకపోవడంతో అపార్ట్ మెంట్లను కొనేవారే లేక డిమాండ్ పడిపోయింది.

దీంతో ఇప్పుడు బతకడానికే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అద్దెకు ఉండడమే ఈ టైంలో మేలని భావిస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో కుప్పకూలడానికి సిద్ధమైంది. బిల్డర్లు రియల్ వ్యాపారులు కూడా ధరలను భారీగా తగ్గించేస్తున్నారు. తక్కువ ధరకే ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్లు లభిస్తున్నాయి. అలా అయినా రియల్ రంగాన్ని బతికించడానికి సిద్దమయ్యారు. ధరలు తగ్గించకపోతే రియల్ రంగం కుప్పకూలడం ఖాయమని.. ఢిల్లీలోలాగానే ఇక్కడే రియల్ ఢమాల్ అంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.