Templates by BIGtheme NET
Home >> Telugu News >> ముప్పావు గంట ఇలా చేస్తే.. కరోనా టెన్షన్ నుంచి రిలీఫ్

ముప్పావు గంట ఇలా చేస్తే.. కరోనా టెన్షన్ నుంచి రిలీఫ్


కంటికి కనిపించని మహమ్మారి ప్రపంచాన్ని వణికేలా చేయటం తెలిసిందే. దగ్గర దగ్గర ఏడాది కాలంగా ఈ అంశం మానవాళికి మింగుడుపడనిది మారింది. రానున్న మరికొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశకు వచ్చిందని చెప్పినప్పటికీ.. అది బయటకు వచ్చి.. సగటు జీవి చెంతకు చేరేసరికి చాలానే సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. కరోనా టెన్షన్ ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తోంది. ఈ మహమ్మారి పుణ్యమా అని ఎక్కడికి వెళ్లాలన్న సందేహం.. ఎవరిని కలవాలన్న భయం.. ఆందోళన వెంటాడుతోంది. కొందరు వీటిని పట్టించుకోకుండా తిరిగేస్తుంటే.. చాలా ఎక్కువమంది మాత్రం నిపుణుల సూచనల్ని.. ప్రభుత్వం చెబుతున్న అంశాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇలాంటివేళ.. చైనాపరిశోధకులు కరోనా కారణంగా తలెత్తుతున్న కుంగుబాటు.. మానసిక ఆందోళన నుంచి బయటపడేందుకు కొత్త సూత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ప్రాక్టికల్ గా దీన్ని పాటిస్తున్న పలువురు అద్భుతమైన ఫలితాల్ని సొంతం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ వారు చెబుతున్న టెక్నిక్ ఏమిటంటే.. ప్రతి రోజు 45 నిమిషాల పాటుకఠినమైన వ్యాయామం.. శారీరక శ్రమ చేయటానికి మించింది లేదంటున్నారు. రెక్కలు ముక్కలయ్యేలా కఠినమైన వ్యాయామం ముప్పావు గంటపాటు ఏం చేస్తామనుకుంటే.. కాస్త తేలికపాటి వ్యాయామం చేయాలని ఫిక్స్ అయితే 108 నిమిషాలు (అటుఇటుగా గంటన్నర) చేస్తే సరిపోతుందంటున్నారు. ఇలా వ్యాయామం మీద ఫోకస్ పెడితే.. ఆందోళనలు పక్కకు వెళ్లిపోతాయంటున్నారు.

ఈ సూత్రాన్ని ప్రతిపాదిస్తున్న చైనా కాలేజీ విద్యార్థులు.. తమపై తాము ప్రయోగం చేసుకున్నారట. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇలా వ్యాయామాన్ని ఫాలో అయిన వారిలో ఏ ఒక్కరికి కరోనా బారిన పడలేదంటున్నారు. దీనికి కారణం ఏమిటి? శాస్త్రీయమైన అంశాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. వ్యాయామం.. శారీరక శ్రమతో మెదడులో డొపమైన్ వంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రసాయనాలు ఎక్కువగా విడుదలవుతాయని.. ఇవి ఉత్సాహాన్ని.. హుషారును కలిగిస్తాయని చెబుతున్నారు. ఏకాగ్రత పెరగటం వల్ల లేనిపోని ఆలోచనలు.. భయాలు మనసును వేధించవని చెబుతున్నారు. వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నొక్కి చెబుతోంది. మరిక ఆలస్యం ఎందుకు.. వెంటనే 45 నిమిషాల వ్యాయామాన్ని షురూ చేయండి.