సచిన్ టెండూల్కర్ ‘గణపతి పూజ’ వీడియో వైరల్…!

0

భారతీయుల అతి ముఖ్య పండుగలలో ‘వినాయక చవితి’ ఒకటి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరూ అత్యంత ఇష్టంతో ఆహ్లాదంగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ‘వినాయక చవితి’ వచ్చిందంటే వాడ వాడల మండపాలు ఏర్పాటు చేసి అందరూ బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తుంటారు. దూప దీప నైవేద్యాలతో లంబోదరుడుకి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఒకప్పటిలా నేడు ‘వినాయక చవితి’ పండుగను జరుపుకోలేకపోతున్నారు. దీంతో ఎక్కువ శాతం మంది ఇంట్లోనే విఘ్నేశ్వరునికి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ఇంట్లోనే గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా సచిన్ టెండూల్కర్ వినాయక చవితి సందర్భంగా తన నివాసంలో పూజలు చేసిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో సచిన్ తన సతీమణితో కలిసి వినాయకుడికి హారతి ఇస్తూ కనిపించారు. అయితే ఆ సందర్భంలో పూజ చేసే పంతుళ్లు ఆన్లైన్ లో పూజామంత్రాలు చదువుతూ కనిపించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని లాప్ టాప్ ముందు పెట్టుకుని జూమ్ ద్వారా సచిన్ తన బంధుమిత్రుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సచిన్ ఇంట్లో జరిగిన ‘గణపతి పూజ’ వీడియో వైరల్ అయింది.