ఇదేం దారుణం కేటీఆర్? వారికి పాజిటివ్ వస్తే చెత్తబండిలో తరలిస్తారా?

0

తెలంగాణ మున్సిపల్ అధికారులు దారుణంగా వ్యవహరించారు. తమ ఉద్యోగులు కరోనా పాజిటివ్ కు గురైతే.. వారిని చెత్త బండ్లలో ఆసుపత్రికి తరలించిన వైనం వివాదంగా మారింది. విన్నంతనే ఒళ్లు మండిపోయేలా ఉండే ఈ ఉదంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం (?) వహిస్తున్న గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ జరిగిందేమిటంటే?

సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 120 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరందరికి దశల వారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగా 85 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో తొమ్మిది మందికి పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అధికారులు కార్మికులకు సమాచారం అందించారు.

దీంతో.. ఆందోళనకు గురైన కార్మికులు తాము పని చేసే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు సరైన రీతిలో స్పందించలేదని చెబుతున్నారు. కార్మికుల చేతుల్లో ఒక్కొక్కరికి రూ.500 చేతుల్లో పెట్టి.. చెత్తను తరలించే ట్రాక్టర్ లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని పేర్కొంటూ తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకున్నారు.

చెత్తను తరలించే చెత్తబండిలో ఆసుపత్రికి వెళ్లిన ఆ తొమ్మిది మంది కార్మికుల్ని చేర్చుకునేందుకు అక్కడి వైద్యాధికారులు ససేమిరా అన్నారు. దీంతో రంగంలోకి దిగారు దళిత సంఘాల నేతలు. ఇదే విషయం సోషల్ మీడియాలో హడావుడిగా మారటంతో మున్సిపల్ శాఖ యంత్రాంగం స్పందించి.. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. పాజిటివ్ అని తేలిన తర్వాత దాదాపు 7 గంటల పాటు ఆసుపత్రిలో చేరటానికి వెయిట్ చేయాల్సి రావటం గమనార్హం.

మున్సిపల్ అధికారుల తీరుపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే మున్సిపల్ శాఖకు చెందిన కార్మికులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవటం.. తండ్రికొడుకులకు నేరుగా సంబంధం ఉన్న వారి విషయంలో ఇంతటి నిర్లక్ష్యం చోటు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. మరీ.. విషయం కేసీఆర్.. కేటీఆర్ వరకు వెళ్లిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.