ప్రపంచం వణికే మాటల్ని చెప్పిన ఆ దేశ అధ్యక్షురాలు

0

దాదాపు ఎనిమిది నెలల క్రితం కరోనా అన్నంతనే వణికిపోయే పరిస్థితి. ఒక్క కేసు వస్తే చాలు.. దాని మూలాలు కనుగొనే వరకు నిద్రపోని పరిస్థితి. అలాంటి మహమ్మారి ఈ రోజున యావత్ ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. చిన్న ఊళ్లో సైతం పదికి పైనే కేసులు నమోదైన దుస్థితి. ఒక ఊపుఊపి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ వైరస్.. జోరు ప్రపంచంలోని పలు దేశాల్లో తగ్గగా.. భారత్ లోనూ తగ్గుముఖం పడుతోంది.

అయితే.. ఈ తగ్గుదల తాత్కాలికమేనని.. చాలాచోట్ల సెకండ్ వేవ్ షురూ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లే.. కేసుల నమోదు భారీగా చోటు చేసుకుంటోంది. దీనికి కారణం.. మొదటి వేవ్ తగ్గిన తర్వాత.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటం.. ప్రజలు సైతం తీసుకునే జాగ్రత్తల్లో మార్పు రావటమే.

ఇప్పటికే పలు దేశాల్లో కేసులు తగ్గి.. మళ్లీ భారీ ఎత్తున పెరుగుతున్న వైనం తెలిసిందే. భారత్ విషయానికి వస్తే.. ఇప్పుడు కేసుల జోరు అంతకంతకూ తగ్గుతోంది. దీంతో.. దేశ ప్రజలంతా సాధారణ పరిస్థితులు ఉన్న వేళలో ఎలా వ్యవహరిస్తారో.. అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ తీరు ప్రమాదకరం. సరిగ్గా.. ఇలాంటి తీరునే ప్రదర్శించిన పలు దేశాల్లో ఇప్పుడు వైరస్ సెకండ్ వేవ్ వీస్తోంది.

యూరోప్ లోని పలు దేశాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చేసిన అలెర్టు.. ప్రపంచ ప్రజలందరికి హెచ్చరికగా చెప్పాలి. ఎందుకంటే.. ఫస్ట్ వేవ్ లోనూ.. జర్మనీ పెద్దగా ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. కోవిడ్ 19 తొలి దశలో వ్యాపించిన దానికరంటే వేగంగా సెకండ్ వేవ్ ఉందన్నారు.

జర్మనీకి రాబోయే నెలల్లో మరింత ఇబ్బందికరంగా ఉండనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని.. మహమ్మారి వేగంగా వ్యాప్తిస్తోందన్నారు. ఆర్నెల్ల క్రితం ప్రారంభమైన వేవ్ తో పోలిస్తే.. రెండో వేవ్ మరింత వేగంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రయాణాల్ని తగ్గించాలని.. సమావేశాల్ని కుదించుకోవాలని.. భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. మరి.. దేశాధ్యక్షురాలి మాటల్ని జర్మనీ ప్రజలు ఏ మేరకు ఫాలో అవుతారో చూడాలి. ఏమైనా.. సెకండ్ వేవ్ ఎంత వేగంగా ఉంటుందన్న విషయాన్ని జర్మనీ ఛాన్సలర్ చెప్పకనే చెప్పారని చెప్పాలి.