చోరీ చేసిన వాటిని మూడేళ్లకు తిరిగి ఇచ్చేసిన మహిళ..ఎందుకంటే?

0

కంటికి ఇంపుగా ఉన్న వాటిని.. ఎవరూ గుర్తించకుండా కొట్టేసే టాలెంట్ కొంతమంది సొంతం. అలా అని వారేమీ స్వతహాగా దొంగలు కావు. మనసు దోచుకున్న వాటిని దోచేస్తుంటారు. తమ సొంతం చేసుకుంటారు. ఇదంతా కూడా చిన్నపాటి సరదాకు ఇలాంటి చేష్టలు చేస్తుంటారు. 15 ఏళ్ల క్రితం ఒక చారిత్మక కట్టడాన్ని సందర్శించిన మహిళ.. అక్కడి విలువైన మూడు చిన్న రాళ్లను ఎవరి కంటా పడకుండా తీసేసుకుంది. వాటిని తన వెంట తీసుకెళ్లింది. సరదాగా.. ఒక గుర్తుగా ఉంటుందని చేసిన ఆ పని తర్వాత ఆమెకు అస్సలు కలిసి రాలేదట.

దరిద్రం ఎంతలా పట్టుకుందంటే.. చోరీ చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆమెకు వచ్చినన్ని సమస్యలు మరెవరికీ రావేమో అన్నట్లు ఉన్నాయట. ఈ విచిత్ర ఘటన ఎక్కడ చోటు చేసుకున్నది చూస్తే.. కెనడాకు చెందిన నికోల్ అనే మహిళ 2005లో ఇటలీని సందర్శించింది. ఆ సమయంలో తన వెంట ఏదైనా గుర్తుగా తీసుకెళ్లాలని భావించింది. ఇక్కడి వరకు ఆమె ఆలోచనలు బాగానే ఉన్నా..ఇక్కడే తేడా కొట్టేశాయి. తన దగ్గర ఏదైనా విలువైన వస్తువును వెంట తీసుకెళ్లాలని భావించిన ఆమె.. ఒక చారిత్రక కట్టడానికి చెందిన మూడు చిన్న వస్తువుల్ని ఆమె దొంగలించారు. సిరామిక్ గోడలోని చిన్న ముక్కతో పాటు.. రెండు తెలుపు రంగు మొజాయిక్ టైల్స్ ను చోరీ చేశారు.

ఎవరూ గుర్తించలేని టాలెంట్ తో తన సొంతం చేసుకున్న ఆమె ఎంచక్కా స్వదేశానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమెకు బ్యాడ్ లక్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యిందట. అప్పటివరకు ఉన్న ఆస్తులు మొత్తం కరిగిపోవటమే కాదు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయట. రెండుసార్లు రొమ్ము కేన్సర్ తో పోరాడాల్సి వచ్చిందట. తన కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా పేర్కొంది.

తాను చేసిన పనికి సంబంధించి ఒక లేఖ రాసి.. ఒక ట్రావెల్ ఏజెంట్ కు తాను దొంగిలించిన వస్తువుల్ని తిరిగి పంపుతూ.. తనకు ఎదురైన చేదు అనుభవాల్ని ఏకరువు పెట్టిందట. ఇలాంటి వస్తువులతో బ్యాడ్ లక్కే ఎదురవుతుంది.. మీ వస్తువుల్ని మీరే తీసుకోడంటూ పేర్కొన్న లేఖను అధికారులు వెల్లడించారు. ఉత్తినే దొరికింది కదా అని.. దేన్ని పడితే దాన్ని వెంట తీసుకొచ్చేస్తే కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.