Templates by BIGtheme NET
Home >> Telugu News >> కాలుష్య కల్లోలం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?

కాలుష్య కల్లోలం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?


కళ్లు తిరిగి పడిపోవడం.. మూర్చ రావడం.. సృహ తప్పడం ఇలా ఏలూరులో వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు కూడా. ఏలూరులో వింత వ్యాధికి కారణం నీటి కాలుష్యమేనని తేల్చారు. ఇప్పుడా ముప్పు విశాఖకు కూడా పొంచి ఉందని.. మరో ఏలూరుగా విశాఖ మారడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ) ద్వారా సరఫరా అవుతున్న నీరు కూడా అనేకచోట్ల కలుషితమవుతోందని పలుమార్లు బయటపడింది. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తరువాత విశాఖలోనూ ఆ భయం పెరిగింది. విశాఖ నగరంలోనూ నీటి వనరులు సురక్షితంగా లేవు. పారిశ్రామిక కాలుష్యం నీటి సరఫరా లైన్లు డ్రైనేజీల మధ్య ఉండటం.. వ్యర్థాలు రిజర్వాయర్లలోకి వదలడం వల్ల నీరు కలుషితమవుతోంది. తాగునీటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం తాగే నీటికి పరీక్షలు జరపాలి.. కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పటికే విశాఖలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ లో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.

మేఘాద్రి గెడ్డ రిజర్వాయరులో పారిశ్రామిక రసాయనిక ఎరువుల వ్యర్థాలు చేరుతున్నాయి. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లను తీసుకెళ్లే ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేఘాద్రిగడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం కలవరపెడుతోంది. మేఘాద్రి గెడ్డ పరిసర ప్రాంతాలైన పెందుర్తి సబ్బవరం నవర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన నీరే ఎక్కువ శాతం రిజర్వాయర్ కు చేరుతుందని జీవీఎంసీ సర్వేలో తేలింది.

విశాఖలో సుమారు 22.5 లక్షల మందికి రోజూ 50 ఎంజీడీలు (మిలియన్స్ ఆఫ్ గాలన్స్ పర్ డే) తాగు నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తోంది. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి నేపథ్యంలో విశాఖ నీటి సరఫరాపై పరిశోధనలు జరపాలంటూ సీఎంకు లేఖ రాశారు మాజీ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ . దీంతో ఏలూరు లో జరిగినట్టే విశాఖలోనూ పునరావృతం అవుతుందా అన్న భయం ఇప్పుడు ప్రజలను వెంటాడుతోంది.