Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏలూరులో కలకలం: కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు.. వింత అరుపులు!

ఏలూరులో కలకలం: కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు.. వింత అరుపులు!


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురై, స్పృహ తప్పి పడిపోవడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు, 40 మంది మహిళలు 33 మంది పురుషులు ఉన్నారని

ఏలూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ తెలిపారు. కొందరు మూర్ఛ లక్షణాలతో, ఇంకొందరు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్‌ మోహన్‌ వివరించారు. వికారం, మానసిక ఆందోళనతో కూడా పలువురు ఆసుపత్రికి పరుగులు తీశారని పేర్కొన్నారు.

ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, అశోక్ నగర్, అరుంధతి పేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు, తలపోటు తదితర లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. హుటాహుటిన అంబులెన్స్‌లను పడమరవీధికి పంపించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గంటగంటకు బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఏలూరులో కలకలం: కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు.. వింత అరుపులు!
అలాగే పడమరవీధిలో వైద్య సిబ్బంది పర్యటించి ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహిస్తోంది. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని మంత్రి ఆళ్ల నాని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. కాగా, ఆస్పత్రిలో చేరిన బాధితులు వింతగా అరుస్తుండటం కలవరపెడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. పడమర వీధికి చెందిన కొంత మంది ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారని చెప్పారు. ఒకేసారి ఇంత మంది అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియరాలేదని.. వైద్య బృందం ఆ పనిమీదే ఉందని చెప్పారు. బాధితులందరినీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 25 మంది ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఒక పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించామని మంత్రి వెల్లడించారు. మిగిలిన 24 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారన్నారు.

ఏలూరులో మంత్రి నాని పర్యటనఅనంతరం మంత్రి నాని ఏలూరులోని దక్షిణ వీధిలో ఇంటింటా తిరిగి పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. మంచినీటిని పరిశీలించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, రాత్రంతా వైద్యులు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు అందించాలన్నారు. విజయవాడలో ఎమర్జెన్సీ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు ఆళ్ల నాని చెప్పారు. కాగా, అస్వస్థతకు గురైన వారి రక్తనమూనాలు సేకరించి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించినట్లు వైద్యులు వెల్లడించారు.

కారణమేం ఇదేనా?
ఇంతమంది ఒకేసారి అస్వస్థతకు గురవడానికి కారణాలేమిటో వైద్యులు, అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మూడు రోజులుగా తాగు నీరు రంగుమారి వస్తోందని, వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వైద్య వర్గాలు కూడా చెబుతున్నాయి. బాధితుల నుంచి రక్త, ఇతర నమూనాలు సేకరించి విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాలకు తీసుకొచ్చారు. వీటిని పరీక్షించాక అస్వస్థతకు కారణాలేమిటో స్పష్టత వస్తుంది. అలాగే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులకు కరోనా వైరస్‌ పరీక్షలు కూడా చేయాలనుకుంటున్నామని వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబాల్లో పేదలు, మధ్య తరగతి వారే ఎక్కువగా ఉన్నారని, పలు కుటుంబాలు పందుల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాయని అధికారులు చెబుతున్నారు.