విషాదం: ‘ఆర్ఆర్ఆర్’ హీరో సోదరుడి మృతి

0

బాలీవుడ్ అగ్ర హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్(51) కన్ను మూశారు. ఆయన గుండెపోటుతో ముంబైలో తుది శ్వాస విడవడంతో అజయ్ దేవగణ్ కుటుంబంలో విషాదం నిండింది.

ఈ విషయాన్ని అజయ్ దేవగన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అనిల్ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నా సోదరుడు మరణించాడంటూ సంతాపం తెలిపారు. అతడి అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని వాపోయాడు.

అనిల్ ను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానని.. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని అజయ్ ప్రార్థించారు. కోవిడ్ కారణంగా ఎలాంటి ప్రార్థన సమావేశం నిర్వహించడం లేదని ఎవరూ రావద్దని అజయ్ దేవగణ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా అనిల్ దేవగన్ కు భార్య ఓ కుమారుడు ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన అనిల్ ఆ తరువాత మూడు సినిమాలను నిర్మించారు. అజయ్ దేవగన్ సినిమాలకు క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేశారు.