ప్రభాస్ ‘ఆదిపురుష్’ కారణంగా 1500 కోట్ల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారా…?

0

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 1500 కోట్ల బడ్జెట్ తో ”రామాయణం” అనే ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్ర నిర్మాణం కోసం నిర్మాతలు మధు మంతెన – నమిత్ మల్హోత్ర – అల్లు అరవింద్ జతకట్టారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి మరియు ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్నారని తెలియజేశారు. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ పార్ట్ 2021లో విడుదలవుతుందని గతేడాది మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ – రామ్ చరణ్ – హృతిక్ రోషన్ – దీపికా పదుకొణె నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి మేకర్స్ నుండి మరో అప్డేట్ రాలేదు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో సైలెంటుగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని టాక్ వస్తోంది.

కాగా ఇతిహాస గాథ ‘రామాయణం’పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు రామాయణాన్ని బ్లాక్ అండ్ వైట్ – కలర్ లో చూశాం. అయితే మెగా ప్రొడ్యూసర్ రామాయణాన్ని 3డీలో తీయబోతున్నామని ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు లేటెస్టుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రామాయణం ఆధారంగా ”ఆదిపురుష్” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇది కూడా 3-డీ టెక్నాలజీతో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అల్లు అరవింద్ ‘రామాయణం’ పక్కన పెట్టేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని భావిస్తున్నాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని అటకెక్కించి ‘ఆహా’ ఓటీటీ మీద ఫోకస్ పెట్టాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక స్టేట్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.