హీట్ తగ్గుతుందని ఓటీటీకి వెళ్తున్నాం

0

అనుష్క హీరోయిన్ గా మాధవన్.. అంజలి కీలక పాత్రల్లో నటించిన నిశబ్దం సినిమా గత ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది సమ్మర్ కు వాయిదా పడింది. సినిమా విడుదల తేదీ ప్రకటించి ప్రమోషన్ కూడా మొదలు పెట్టిన సమయంలో కరోనా మహమ్మారి కారణంగా మొత్తం తారు మారు అయ్యింది. థియేటర్లు మూత పడటంతో సినిమాను వాయిదా వేశారు. థియేటర్లు ఓపెన్ చేస్తే బిగ్ స్ర్కీన్ లో సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని నెలలు గడిచి పోతున్నా కూడా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ సందర్బంగా సినిమాకు రచయితగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించిన కోన వెంకట్ మాట్లాడుతూ… దర్శకుడు హేమంత్ ఈ కాన్సెప్ట్ చెప్పిన వెంటనే థ్రిల్లింగ్ గా అనిపించింది. ఆ ఐడియాను కథగా మల్చేందుకు చాలా కష్టపడ్డాం. అదో ఛాలెంజింగ్ గా అనుకుని రెడీ చేశాం. మేమిద్దరం మంచి మిత్రులం అవ్వడం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరం షేర్ చేసుకుంటూ మంచి కథను రెడీ చేశాం. మొదట ఈ సినిమాను మూకీగా తీయాలనుకున్నాం. కాని అనుష్క మాత్రమే మాట్లాడలేదు వినలేదు. మిగిలిన పాత్రలు ఎందుకు మౌనంగా ఉండాలని అనుకున్నాం. అందుకు మూవీ ఐడియాను కాస్త టాకీగా మార్చేశాం. అమెరికాలో ఈ సినిమాను 60 రోజుల పాటు షూటింగ్ చేశాం. అత్యంత కఠిన పరిస్థితుల్లో సినిమాను షూట్ చేశాం.

థియేటర్లలో విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేశాం. కాని మరింతగా ఆలస్యం అయితే సినిమా చుట్టు ఉన్న హీట్ తగ్గుతుందని అనిపించింది. నిశబ్దం పై ఉన్న హీట్ తగ్గకుండానే ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాము. ఓటీటీలో సినిమా విడుదల అయితే ఫలితాన్ని దాచడం సాధ్యం కాదు. సినిమాను చూసిన వారు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. కనుక వెంటనే సినిమా ఫలితం తేలిపోతుంది. కాని థియేటర్లలో విడుదల అయిన సినిమా ఫలితాన్ని కొన్ని రోజులు అయినా దాచి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. సంక్రాంతి వరకు సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యి ప్రేక్షకులు మునుపటి మాదిరిగా వస్తారని ఆశిస్తున్నా అంటూ ఆయన చెప్పుకొచ్చారు.