సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు

0

సినిమా నిడివి అనేది 2 గంటలకు మించి ఉండకూడదని ప్రముఖహీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హర్ష కనుమిల్లి సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ‘సెహారీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ స్నేహితుడు – మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అడ్వాయి జిష్ణు రెడ్డి.. కన్య పిక్చర్స్ బ్యానర్ పై శిల్ప చౌదరి సహకారంతో నిర్మిస్తున్నారు. గంగసాగర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. జిష్ణు నిర్మాత కావడంతోనే తాను ఈ ఈవెంట్ కు వచ్చానని బాలయ్య చెప్పాడు.

‘నా సినిమాల్లో అన్ని అంశాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అద్భుతమైన ఫైట్లు – డైలాగులు – డ్యాన్సులు ఏవి లేకపోయినా వాళ్లు ఒప్పుకోరు. కానీ సినిమా తీస్తున్నప్పుడు నిర్మాత ఆర్థికపరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సినిమాను బడ్జెట్ లో ఉంచేందుకు ప్రయత్నించాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు – సామాజిక సేవ అంటే తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పారు.

సామాజిక సేవ చేయడం తమ రక్తంలోనే ఉందన్నారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చైర్మన్గా కూడా ఉన్నాను. ఇవన్నీ ఉన్నప్పటికీ సినిమాల్లో నటించడమే నాకు సంతృప్తి ఇస్తుంది. తెలుగులో కొత్త నటీనటులు – కొత్త దర్శకులు రావాలని.. కొత్త కథలు – విభిన్నమైన దర్శకులు రావాలి.’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

బాలకృష్ణ ఇటీవల ఆన్ లైన్ లో విడుదల చేసిన ‘నర్తనశాల ’ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రంలో బాలకృష్ణ ఆహార్యం – ఆయన డైలాగులు చెప్పిన తీరుకు ప్రశంసలు దక్కాయి. మరోవైపు బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ (బీబీ3) కూడా విడుదలై ప్రేక్షకులను అలరించింది. గతంలో వీరిద్దరి కాంభినేషన్ లో వచ్చిన సింహా – లెజెండ్ చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో.. కొత్త సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.