Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇండస్ట్రీ హిట్టేనా.. పాన్ ఇండియా మూవీ తీయరా చినబాబూ?

ఇండస్ట్రీ హిట్టేనా.. పాన్ ఇండియా మూవీ తీయరా చినబాబూ?


ప్రస్తుతం పాన్ ఇండియా ఫీవర్ అంతకంతకు రాజుకుపోతోంది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న అగ్ర నిర్మాణ సంస్థలన్నీ పాన్ ఇండియా (వరల్డ్) చిత్రాలపై కన్నేశాయి. స్టార్ హీరోల్ని ఎంపిక చేసుకుని ఇరుగు పొరుగు స్టార్లను కలుపుకుని ఇటు తెలుగు మార్కెట్ తో పాటు అటు ఇరుగుపొరుగు మార్కెట్ల నుంచి బాహుబలి రేంజులో కాసులు కొల్లగొట్టాలన్న పంతంతో ఉన్నారంతా.

కానీ ఒక సంస్థ మాత్రం సాఫీగా సాలిడ్ గా టాలీవుడ్ మార్కెట్ పై మాత్రమే కన్నేసింది. అత్యాశకు పోకుండా తెలుగు ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని ఫోకస్ చేస్తోంది. ఆ కోవలోనే ఆస్థాన దర్శకుడు గురూజీ త్రివిక్రమ్ తో కలిసి వరుసగా క్లాసిక్ చిత్రాల్ని తెరకెక్కిస్తూ విజయాలు అందుకుంటోంది. ఆ సంస్థ ఏదో అధినేత ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ (చినబాబు) గురించే ఇదంతా.

తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ లపై హ్యాట్రిక్ లు కొడుతూ దూసుకెళుతున్నారు చినబాబు. జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి.. అల వైకుంఠపురములో అంటూ ఒక్క బన్నీతోనే మూడు రికార్డ్ హిట్లు అందుకున్నారు. అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ లో నాన్ బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేయడం సంచలనమైంది. 2020 బెస్ట్ సినిమా తీసింది హారిక బ్యానరే. అ..ఆ – భీష్మ లాంటి బ్లాక్ బస్టర్లను నితిన్ కి అందించింది రాధాకృష్ణ సంస్థనే. వీటికి త్రివిక్రమ్ దర్శకుడు. పవన్ .. చరణ్ తోనూ సమర్పకుడిగా చినబాబు విజయవంతమైన సినిమాలు తీసారు.

ఇక ఈ బ్యానర్ కి అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ చక్కని క్లాస్సీ సినిమాల్ని తీస్తోంది. జెర్సీ ఈ కోవకే చెందుతుంది. అలాగే ఈ బ్యానర్లలో వరుసగా పలు మలయాళ బ్లాక్ బస్టర్లు రీమేకవుతున్నాయి. తదుపరి ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి రాధాకృష్ణ భాగస్వామ్యంలో పలు క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అదంతా సరే కానీ.. రేస్ లో ఉన్న ఇతర అగ్ర బ్యానర్లన్నీ పాన్ ఇండియా సినిమాలు అంటూ హడావుడి చేస్తున్నాయి. వైజయంతి మూవీస్ లో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ సెట్సెకెళ్లనుంది. అలాగే గీతా ఆర్ట్స్ లో పుష్ప ని పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కించాలన్న ప్లాన్ తో ముందుకెళుతున్నారు. డీవీవీ దానయ్య ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రం తీస్తున్నారు. యువీ సంస్థ సాహో తీసింది. డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ లో ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. దిల్ రాజు ఈ తరహా ప్రణాళికల్లో ఉన్నారు. మరి వీళ్లతో పోటీపడుతూ రాధాకృష్ణ మునుముందు భారీ పాన్ ఇండియా సినిమాలు తీస్తారా? హిస్టారికల్.. ఫిక్షన్.. సైన్స్ ఫిక్షన్ కథాంశాలతో భారీ ప్రయోగాలు చేస్తారా? అన్నదానికి ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంది. నేడు ఇండస్ట్రీ అగ్ర నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు సందర్భంగా `TeluguNow.com` తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.