‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ సింగిల్…!

0

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975’ అనే వినూత్నమైన సినిమాతో రాబోతున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ – రాజులు నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. విలక్షణ నటుడు సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘Rx 100’ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ నుంచి మొదటి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కాగా ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రంలోని ‘చూసాలే కళ్లారా..’ అనే ఈ పాటను యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘ఈ నేల తడబడే.. వరాల వరవడే.. ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే.. అదేదో అలజడే.. క్షణంలో కనబడే.. గతాలు వదిలి పారిపోయే చీకటే..’ అంటూ సాగిన ఈ పాటకు ప్రముఖ లిరిక్ రైటర్ క్రిష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో హీరో హీరోయిన్ వెంటపడే సన్నివేశాలను చూపించారు. చైతన్ భరద్వాజ్ కంపోజిషన్ కి క్రిష్ణ కాంత్ లిరిక్స్ మరియు సిద్ శ్రీరామ్ గాత్రం తోడై ‘చూసాలే కళ్లారా..’ సాంగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.