Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘విరాటపర్వం’ .. రానా అజ్ఞాతవాసం ముగిసినట్టే!

‘విరాటపర్వం’ .. రానా అజ్ఞాతవాసం ముగిసినట్టే!


రానా తెలుగు తెరపై కథానాయకుడిగానే అడుగుపెట్టాడు. అయితే ఆయన హీరోగా చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ‘బాహుబలి’ సినిమాలో విలన్ గా మెప్పించాడు. రానాలోని నటుడిని ఈ సినిమా కొత్త కోణంలో ఆవిరిష్కరించింది. విలన్ గా అదరగొట్టేసిన ఆయనను ఆ తరువాత నుంచి హీరోగా కూడా అంగీకరించడం విశేషం. సరైన పాత్ర పడాలేగానీ రానా నటన ఒక రేంజ్ లో ఉంటుందనడానికి నిదర్శనమే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన నటనను ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు.

రానా హీరోగా చేసిన సినిమాల్లో ఆయనకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టిన సినిమాగా ‘నేనే రాజు నేనే మంత్రి’ కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన నుంచి మరిన్ని విభిన్నమైన కథలు .. పాత్రలు వస్తాయని అంతా అనుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ‘హాథీ మేరే సాథీ’ వంటి భారీ ప్రాజెక్టును .. ‘విరాట పర్వం’ను అంగీకరించాడు. ఈ సినిమాల షూటింగు జరుగుతున్నప్పుడే ఆయన ఆరోగ్యం దెబ్బతినడం .. విదేశాలకు వెళ్లడం .. కోలుకోవడానికి సమయం పట్టడం జరిగింది. ఇక నెమ్మదిగా షూటింగులను దార్లో పెడదామని అనుకుంటున్న సమయంలోనే లాక్ డౌన్ పడింది.

అలా అనారోగ్యం .. లాక్ డౌన్ కారణంగా రానా సినిమాలకి గ్యాప్ వచ్చేసింది. ఆయన చేసిన గెస్టు రోల్స్ పక్కన పెట్టేస్తే పూర్తిస్థాయి కథానాయకుడిగా ఆయనను తెరపై చూసి మూడేళ్లు దాటిపోయింది. అందువలన ఆయన సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అరణ్య’ (హాథీ మేరే సాథీ) .. ‘విరాటపర్వం’ సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. త్రిభాషా చిత్రమైన ‘అరణ్య’ .. ఈ నెల 26వ తేదీన థియేటర్లకు వస్తుంటే ఇక ‘విరాటపర్వం’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన విడుదల కానుంది. ‘విరాటపర్వం’ అంటే మహాభారతంలో అజ్ఞాతవాస కాలం. అంటే రానా ఈ సినిమాతో తన అజ్ఞాతవాసాన్ని పూర్తిచేశాడనే అనుకోవాలేమో!