కోతి కొమ్మచ్చి నే నమ్ముకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న..!

0

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘శతమానంభవతి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న.. ఆ తర్వాత రెండు వరుస ప్లాప్స్ అందుకున్నాడు. యూత్ స్టార్ నితిన్ – రాశీ ఖన్నా లతో తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’.. నందమూరి కళ్యాణ్ రామ్ తో తీసిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో కొంత విరామం తీసుకున్న సతీష్ వేగేశ్న ”కోతి కొమ్మచ్చి” అనే సినిమాతో వస్తున్నాడు. తనయుడు సమీర్ వేగేశ్న ని హీరోగా పరిచయం చేస్తూ.. మరో హీరోగా రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి ని తీసుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ మరియు నటీనటుల వివరాలు వెల్లడించారు.

‘కోతి కొమ్మచ్చి’ సినిమాలో యంగ్ బ్యూటీస్ రిద్ది కుమార్ – మేఘా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ – సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ అమలాపురం పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. అక్కడ రెండు వారాల పాటు ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేషాలు చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని చూస్తున్న సతీష్ వేగేశ్న ‘కోతి కొమ్మచ్చి’ని యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. తన డెబ్యూ మూవీ ‘దొంగల బండి’.. ‘కబడ్డీ కబడ్డీ’ వంటి సినిమాల తరహాలో హిలేరియస్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సతీష్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.