ఈటీవీ రజతోత్సవ వేళ.. తన మాటలతో రామోజీ దొరికిపోయారా?

0

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మీడియా మొఘల్ అన్న మాటకు దేశీయంగా రామోజీ రావు పేరు తప్పించి మరెవరి పేరు కనిపించదు.. వినిపించదు కూడా. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు ఇప్పటికి చాలానే విలువ ఉంది. అదే పనిగా మాట్లాడటం..వార్తల్లో కనిపించటం ఆయన సిద్ధాంతానికి విరుద్దం. తానేం చేయాలనుకున్న చేసేయటమే తప్పించి.. మాటలు మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదు. ఇప్పుడంటే.. సంస్థ కార్యక్రమాల్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఈనాడు స్టార్ట్ చేసిన మొదట్లో సంస్థ కార్యక్రమం ప్రైవేటు వ్యవహారంగా అభివర్ణించేవారు. ఈ కారణంతోనే ఆయన ఫోటోలు ఎక్కువగా ఆయన మీడియాలో కనిపించేవి కాదు.

ఎప్పుడైతే ఆయన వారసుల తరం వచ్చిందో.. అప్పటి నుంచి కాస్త వారికి సంబంధించి ఫోటోలు.. వార్తలు కనిపించేవి. తాజాగా ఈటీవీ రజతోత్సవ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామోజీరావు కీలక వ్యాఖ్య చేశారు. తమ పాతికేళ్ల ప్రయాణంలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. ఈటీవీ ప్రారంభించిన రోజున తానో మాట ఇచ్చానని.. ఈటీవీలో ప్రసారమయ్యే ఏ కార్యక్రమమైనా.. అందంగా.. ఆరోగ్యకరంగా ఉంటుందని.. అనూభూతిని కలిగించి ఆలోచన రేకెత్తిస్తుందని.. అదే మాటను తాము నిలబెట్టుకున్నట్లు చెప్పారు.

రామోజీ ఇంత ఓపెన్ గా అలా ఎలా చెబుతారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. నేరాలు.. ఘోరాలు పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. తర్వాతి కాలంలో ఈటీవీనే స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిలిపివేయటం రామోజీ మర్చిపోయారా? అన్నది ప్రశ్న. ఆ కార్యక్రమాన్ని పక్కన పెడితే.. జబర్దస్త్ మీద ఉన్నన్ని విమర్శలు.. ఆరోపణలు మరే కార్యక్రమం మీదనైనా ఉందా? డబుల్ మీనింగ్ మాటలతో పాటు.. నాటు జోకులతో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంను పలువురు తప్పు పట్టటాన్ని మర్చిపోలేం. అలాంటి విషయాల్ని వదిలేసి.. తామిచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా రామోజీ చెప్పటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి రామోజీ నోట ఆ మాట రాకున్నా.. కొంపలు మునిగేదేమీ ఉండదు. మాట అని వేలెత్తి చూపించుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది అసలు ప్రశ్న.