ఒక రిలీజ్ అయినా లేదు ఇంతలోనే నాలుగు ఆఫర్లు

0

అవును.. ఇంకా ఒకటో సినిమా రిలీజ్ అయినా కాలేదు. అప్పుడే నాలుగు సినిమాల్ని లాక్ చేసేంత స్పీడ్ మీద ఉన్నాడట డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్. అయితే ట్యాలెంట్ ఎంతో తెలియకుండానే ఎలా ఆఫర్లు ఇస్తున్నారు? అంటే దాని వెనక పెద్ద కథే ఉంది.

నిజానికి మెగా ఫ్యామిలీ హీరో అంటేనే ఆఫర్లకు కొదవేమీ ఉండదు. మెగా బ్రదర్స్ అండదండలతో సినిమా సజావుగా రిలీజవుతుందన్న నమ్మకం దర్శకులకు ఉంటుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అని మేకర్స్ భావిస్తుంటారు. కానీ అలా పెద్దన్నల అండదండలతో పని లేకుండా ప్రతిభతో ఆకట్టుకుని అవకాశాలు దక్కించుకునేందుకే ఆ కుటుంబంలోని యువహీరోలు శ్రమిస్తుంటారు. అదే మెగా హీరోల ప్రత్యేకత.

ఈ కోవలోనే మెగా మేనల్లుడు సాయి తేజ్ ఎంతో శ్రమించి తనకంటూ ఒక రూట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వెళుతున్నాడట. నటించిన తొలి సినిమాతోనే అతడు ఎంత హార్డ్ వర్కరో ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ అయిపోయిందట. ఆన్ లొకేషన్ ఎంతో ఇన్వాల్వ్ అయ్యి నటించడం అతడికి అలవాటు. రాజీ అన్నదే లేకుండా కమిట్ మెంట్ తో శ్రమిస్తాడట. మావయ్య చిరంజీవి నుంచి అబ్బిన గుణం ఇదన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.

వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన ఈపాటికి రావాల్సి వున్నా కోవిడ్ వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఉప్పెన ప్రీవిజువల్స్ చూశాక.. వైష్ణవ్ వర్క్ ఎలా ఉంది? అన్నది ఇండస్ట్రీ దర్శకనిర్మాతలకు అర్థమైపోయింది. ఆ క్రమంలోనే అతడికి క్రిష్ కూడా ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో కొండపొలం చిత్రీకరణ సాగుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. వైష్ణవ్ ఇందులోనూ విలేజ్ కుర్రాడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి పని చేసేప్పుడు అతడి డెడికేషన్ క్రిష్ కి విపరీతంగా నచ్చేసిందట. దీంతో వైష్ణవ్ కి అతడే బోలెడంత బూస్టప్ ఇస్తున్నారని సమాచారం. ఇలాంటి పాజిటివ్ టాక్ వల్ల పలు క్రేజీ బ్యానర్లు ఆఫర్లతో అతనిని సంప్రదించాయని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. వైష్ణవ్ తేజ్ ఇప్పటికి మరో రెండు ప్రాజెక్టుల కోసం చర్చలు సాగిస్తున్నాడు. అందులో ఒకదానికి ఎస్ చెప్పేశాడట. అంటే ఇప్పటికే రెండు సినిమాల్లో నటించేయగా మూడో సినిమాకి ఓకే చేసేసినట్టే. నాలుగో మూవీకి సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. వేరే కథలు కూడా వింటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇంకా డెబ్యూ మూవీ రాకుండానే ఇలా వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్న స్టార్ గా వైష్ణవ్ పేరు టాలీవుడ్ లో మార్మోగనుంది.