దిల్ రాజు నిర్ణయం మిగతా సినిమాలపై ఒత్తిడి తెస్తోందా…?

0

కరోనా దెబ్బకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే విడుదలకు నోచుకోని సినిమాలన్నిటిని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో లేటెస్టుగా నాని కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన ‘వి’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాని – సుధీర్ బాబు – నివేద థామస్ – అదితి రావ్ హైదరి వంటి స్టార్స్ నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ‘వి’ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు భావించినా థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల విడుదల వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఓటీటీ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ రావడంతో ‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేసారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్ణయం విడుదల కాని మిగతా సినిమాలపై ఒత్తిడి తెస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా కరోనా కారణంగా టాలీవుడ్ లో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. వాటిలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’.. రామ్ పోతినేని ‘రెడ్’.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’.. యాంకర్ ప్రదీప్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ వంటి సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంచుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఒత్తిడి ఎదుర్కుంటున్నాయట. ముఖ్యంగా ‘నిశ్శబ్దం’ మేకర్స్ దీని గురించి ఆలోచిస్తున్నారట. ఇటీవల నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ట్విట్టర్ లో ”మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే… ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఏ వేదికపై చూడాలనుకుంటున్నారు” అని ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ లో 56.5 % ఓటీటీలో రిలీజ్ చేయమని.. 28.7 % థియేటర్స్ లో రిలీజ్ చేయమని.. మిగతా వారు ఎక్కడైనా పర్వాలేదని చెప్పారు. అయినప్పటికీ ‘నిశ్శబ్దం’ విషయంలో మేకర్స్ నిశ్శబ్దంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజు ‘వి’ వంటి భారీ బడ్జెట్ సినిమాని డిజిటల్ రిలీజ్ చేస్తుండటంతో ‘నిశ్శబ్దం’ మేకర్స్ కూడా ఏదొక డీల్ ని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ‘నిశ్శబ్దం’ విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.