2021 ఎన్నికలే లక్ష్యంగా కమల్ హాసన్ మూవీ ప్లాన్?

0

ఎన్నికలొస్తున్నాయి అంటే అందుకు తగ్గట్టు స్టార్ల సినిమాల్లో కంటెంట్ కూడా మారుతుంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్న స్టార్లు నటించే సినిమాలు పొలిటికల్ కథాంశంతో వేడెక్కించేవే అయ్యి ఉంటాయి. రాజకీయాలు సామాజిక సేవ అంటూ ప్రత్యర్థులపై పంచ్ లు అదిరిపోయే రేంజులో ఉంటాయి. ఇంతకుముందు ఎన్నికల ముందు విజయ్ నటించిన మెర్సల్ ఈ తరహాలోనే వచ్చి వివాదాస్పదమైంది. ఓటు హక్కు నేపథ్యంలో తంబీలు చేసిన రచ్చ చాలా దూరమే వెళ్లింది. ఆ తర్వాత విజయ్ ని తమిళనాడు ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడం తెలిసినదే.

అదంతా సరే కానీ.. 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు అగ్ర దర్శకులు మాస్టర్ ప్లాన్ తో ముందుకు దూసుకు రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న కమల్ హాసన్ లాంటి స్టార్ తో మురుగదాస్ తొడకొట్టించేందుకు గట్టి ప్లాన్ లోనే ఉన్నాడట.

అందుకోసం ఏకంగా దళపతి విజయ్ సినిమానే వదిలేస్తున్నాడట. ఇప్పటికే విజయ్ తో ప్లాన్ ని పక్కన పెట్టేశాడట. నిజానికి ఈ చిత్రం 2021 ప్రథమార్థంలోనే సెట్స్ కెళ్లాల్సి ఉండగా.. అంతకంటే ముందే కమల్ హాసన్ తో సినిమాని లాక్ చేశాడట. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ను ఒక ప్రత్యేకమైన సామాజిక అంశాన్ని కలిగి ఉన్న స్క్రిప్ట్ తో మురుగదాస్ సంప్రదించారు. 2021 లో కమల్ హాసన్ తన మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నందున ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నికలకు ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే విజయ్ తో సినిమాని మురుగదాస్ పక్కన పెట్టినట్టేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.