గప్ చుప్.. కీర్తి సురేష్ డెబ్యూ మూవీ టాప్ సీక్రెట్ ఇదీ

0

సినిమా ఇండస్ట్రీ కెరీర్ కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏళ్లకు ఏళ్లు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా తికాణా లేని వాళ్లే ఎక్కువ ఇక్కడ. ఇక అలాంటి అనుభవం మహానటి కీర్తి సురేష్ కే ఎదురైంది! అంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి పాపులర్ హీరోయిన్ మేనక వారసురాలిగా ఆరంగేట్రం చేసినా టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆరంభమే చుక్కెదురైందట. నిజానికి కీర్తి తొలి సినిమా మిడిల్ డ్రాప్ అయిపోవడం తో ఆ ప్రభావం కూడా తనపై అంతే పడిందన్నది ఇన్నాళ్టికి లోగుట్టు బయటపడింది.

2016 లో రామ్ సరసన `నేను శైలజ` చిత్రం తో టాలీవుడ్ లోకి ప్రవేశించిందని కీర్తి గురించి ప్రచారమైనా.. నిజానికి వాస్తవం వేరే. అంతగా బయటి ప్రపంచానికి తెలియని వేరొక తెలుగు చిత్రానికి కీర్తి సురేష్ సంతకం చేసింది. `ఐనా ఇష్టం నువ్వు` అనేది ఆ మూవీ టైటిల్. ఆర్ట్ డైరెక్టర్ కం నిర్మాత చంటి అడాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఛాయాగ్రాహకుడు రామ్ ప్రసాద్ తొలిసారి ఈ మూవీతో దర్శకుడయ్యారు. అయితే తెలియని కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆసక్తికరంగా ఇదే చిత్రంతో సీనియర్ నరేష్ వారసుడు నవీన్ కృష్ణ హీరోగా పరిచయం కావాల్సింది. అతడికి అది మైనస్ అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం.. టైటిల్ ని మార్చి ఇప్పుడు `జానకి నేను` పేరుతో ఆ మూవీని రిలీజ్ చేయనున్నారట. ఈ చిత్రం అక్టోబర్ లో ఒటిటి ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అయితే ఈ మూవీ ఇంకా వివాదాల్లో నానుతోంది. చంటి అడ్డాల నుంచి ఈ మూవీ రిలీజ్ హక్కుల్ని తాను కొనుక్కున్నానని నట్టి కుమార్ వాదిస్తున్నారట. చంటి అడ్డాల నుండి ఈ చిత్ర హక్కులను తాను కొనుగోలు చేశానని నిరూపించడానికి తన వద్ద అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలు ఉన్నాయని నట్టి చెబుతున్నారు. ఈ కొత్త వివాదంతో కీర్తి డెబ్యూ (కావాల్సింది) మూవీ వెలుగు చూస్తుందా లేదా అనేది చూడాలి.