క్రిష్ ది మామూలు స్పీడు కాదబ్బా..

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈ ఏడాది ఆరంభంలో కొత్త సినిమా మొదలుపెట్టాడు క్రిష్. ఒకటో రెండో షెడ్యూళ్లు చేసేసరికి కరోనా వచ్చి అడ్డం పడింది. లాక్ డౌన్ విరామం తర్వాత క్రిష్ రెడీ అయినా.. పవన్ అందుబాటులోకి రాలేదు. ఆయన వచ్చే లోపు ఉన్న వ్యవధిలో ఓ సినిమా తీద్దామని సంకల్పించాడు క్రిష్. ఆ సినిమా మొదలై మూణ్నెల్లు కూడా కాలేదు. ఓ నవల ఆధారంగా స్క్రిప్టు తయారు చేసుకుని రంగంలోకి దిగిన క్రిష్.. జెట్ స్పీడులో ఈ సినిమాను ముగించేశాడు. అందరూ ఇంకా ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో ఉందేమో అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు ఇందులో కథానాయికగా నటిస్తున్న రకుల్ ప్రీత్ వెల్లడించడం విశేషం. తన కొత్త సినిమాల గురించి రకరకాల ప్రచారాలు నడుస్తున్న నేపథ్యంలో రకుల్ తాజాగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

తాను చేస్తున్న చేయబోయే ప్రాజెక్టుల గురించి ఆమె ఇందులో వెల్లడించింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన ‘చెక్’ చేస్తున్నట్లు చెప్పిన రకుల్.. క్రిష్ దర్శకత్వంలో తాను పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించింది. ఇది చూసి క్రిష్ మరీ ఇంత స్పీడేంటి బాబోయ్ అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. పవన్ అందుబాటులోకి వచ్చేలోపు క్రిష్ ఈ సినిమా పూర్తి చేయగలడా అని సందేహిస్తే.. ఇప్పుడు క్రిష్ ఆ సినిమా చేసి పవన్ కోసం ఎదురు చూసే పరిస్థితి రావడం అనూహ్యమే. పవన్ ఇంకో రెండు నెలలకు కూడా క్రిష్ సినిమాకు అందుబాటులోకి రాకపోవచ్చని సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ‘వకీల్ సాబ్’లో పవన్ తో కలిసి తాను జనవరి లో షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు శ్రుతి హాసన్ తాజా గా వెల్లడించింది. మరి అవకాశమిస్తే తన సినిమాను కూడా వేగంగా పూర్తి చేద్దామనుకుంటున్న క్రిష్ కు పవన్ ఎప్పుడు ఛాన్సిస్తాడో?