అతిలోకసుందరి బయోపిక్ లో నటించాలని ఆశపడుతున్న లక్కీ బ్యూటీ…!

0

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘అతిలోకసుందరి’ దివంగత శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఆరాటపడుతోంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ లక్కీ బ్యూటీ తన మనసులోని మాటను బయట పెట్టింది. శ్రీదేవి బయోపిక్ – సౌందర్య బయోపిక్.. వీటిలో నేను దేంట్లో నటిస్తే బాగుంటుంది? అని ఈ చిట్ చాట్ లో తన అభిమానులను అడిగింది. రష్మిక ఫ్యాన్స్ అందరూ శ్రీదేవి బయోపిక్ లో నటిస్తే బాగుంటుందని ఆమెకు సమాధానం ఇచ్చారు. దీనికి రష్మిక సైతం సంతోషపడి నేను కూడా అదే అనుకున్నానంటూ వారికి బదులిచ్చింది.

కాగా ఇండియన్ సినిమాలో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి అలరించిన శ్రీదేవి బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయని ఈ మధ్య వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి బయోపిక్ కోసం ఆమె భర్త బోనీ కపూర్ ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న ని అతిలోకసుందరి పాత్ర కోసం ఆలోచిస్తారేమో చూడాలి. ఇక రష్మిక టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు నితిన్ ‘భీష్మ’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం కార్తీతో ‘సుల్తాన్’.. అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమాల్లో నటిస్తోంది.