సారీ చెప్పిన నెట్ ఫ్లిక్స్.. కారణం ఏంటో తెలుసా?

0

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమాలన్నీ నిలిచిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. కానీ ఇది వస్తుందని ముందే ఊహించిందో లేక.. ప్రపంచం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనో కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఈ కరోనా వేళ భారీగా లాభపడ్డాయి.

ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లెక్స్ ఇప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలతో దుమ్మురేపుతోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నింటికంటే పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్. ఆ సంస్థ రోజుకు ఏకంగా 200 కోట్ల వరకు ఖర్చు పెట్టి కొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తోంది.

ఈ క్రమంలోనే ఒక వివాదాస్పద చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంది. దాని ప్రోమో విడుదల చేశాక పెద్ద దుమారం రేపింది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ‘క్యూటీస్’ పేరుతో ఫ్రెంచ్ భాషలో తీసిన ‘మిగ్నోనెస్’ అనే చిత్రాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రోమో విడుదల చేసింది.

పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో 11 ఏళ్ల ముస్లిం బాలిక జీవితమే ఈ చిత్రం. కుటుంబ కట్టుబాట్లను తెగదన్ని ఒక డ్యాన్సర్ గా ఆమె ఎదిగిన తీరు ఈ చిత్రం. అయితే అందులో బాలిక అర్థనగ్నంగా డ్యాన్సులు చేయడం.. ఆమెతో చాలా మంది చిన్న పిల్లలు అలా అర్ధనగ్నంగా కనిపించేలా ప్రోమోను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.

దీంతో ఇది దుమారం రేపింది. ఈ సినిమా వివాదానికి కారణమైంది. సినిమాను నిషేధించాలని.. నెట్ ఫ్లిక్స్ ను బాయ్ కాట్ చేయాలని.. చిన్నపిల్లల అశ్లీలతను సెక్స్ వాలిటీని నెట్ ఫ్లిక్స్ చూపిస్తోందని.. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీనిపై ఒక పిటీషన్ కూడా కోర్టుల్లో దాఖలైంది. దీంతో వెంటనే తేరుకున్న నెట్ ఫ్లిక్స్ అందరికీ సారీ చెప్పి ఆ సినిమాను ప్రొమోలను తీసేస్తున్నట్టు స్పష్టం చేసింది.