మత్తుకళ్ల సుందరి మాటే లేదాయే!

0

అందమైన ఆ కళ్లు కవ్విస్తాయి .. కైపెక్కిస్తాయి. ఊరిస్తాయి .. ఉత్సాహపరుస్తాయి .. ఊహాలోకంలో ఊరేగిస్తాయి. ఆ కళ్ల వాకిలిలో నిలవాలనీ .. ఆ తలపుల వానలో తడవాలని కోరుకోని కుర్రాళ్లు ఉండరు. విచ్చుకున్నట్టుగా కనిపించే పెదాలతో .. గుచ్చుకున్నట్టుగా అనిపించే చూపులతో ఆకట్టుకునే ఆ అందం పేరే నందిత శ్వేత. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో దెయ్యం పాత్రలో ఆమె అదరగొట్టేసింది. ఆమెను చూసినవాళ్లు దెయ్యాలు కూడా ఇంత అందంగా ఉంటాయా అనుకున్నారు .. ఆశ్చర్యపోయారు.

తొలి సినిమాలో పోషించిన పాత్ర ప్రభావం కారణంగా అదే తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అదే సమయంలో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను కూడా చేసింది. నందిత శ్వేతలో ఆమె కళ్లే ప్రధానమైన ఆకర్షణ. మత్తుమందును నింపుకున్న పాత్రల్లా ఆమె కళ్లు కనిపిస్తాయి. అందువల్లనే ఆమె నయన ప్రధానమైన పాత్రలు చేయవలసి వచ్చింది. ఆ తరువాత ఆమెకి పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడం .. చేసిన చిన్న సినిమాలు పేలిపోవడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ప్రేక్షకులు ఆమెను మరిచిపోయే పరిస్థితికి వచ్చేశారు.

నందిత శ్వేత చేతిలో ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు .. ఒక తెలుగు సినిమా ఉన్నాయి. తెలుగులో సుమంత్ కథానాయకుడిగా రూపొందిన ‘కపటధారి’ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఇదే తమిళ సినిమాలో శిబి సత్యరాజ్ జోడీగా కూడా ఆమెనే నటించింది. ఈ రెండు సినిమాలకి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిజానికి నందిత శ్వేతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. కనీసం రెండవ కథానాయిక పాత్రలకైనా ఆమెను తీసుకోవచ్చు. లేదంటే విలనీ రోల్స్ కి కూడా ఆమె బాగానే సెట్ అవుతుంది. కానీ తెలుగుకి సంబంధించి కొత్త ప్రాజెక్టులలో ఎక్కడా ఆమె మాటే వినిపించడం లేదు. ఇక ఈ అమ్మాయి కూడా కోలీవుడ్ పైనే పూర్తి దృష్టి పెడుతుందేమో!