‘ఆదిపురుష్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆది పురుష్” సినిమాతో బాలీవుడ్ కు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘తాన్హాజీ’ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ లు కలిసి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో రామాయణ ఇతిహాసంలోని రాముడు హనుమంతునితో పాటు పలువురు మునుల పాత్రలను ప్రతిబింబించేలా చిత్రాలు ఉండటంతో ఇది పౌరాణిక చిత్రమేనని.. ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని అందరూ అనుకుంటున్నారు.

కాగా లేటెస్టుగా ‘ఆది పురుష్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాను తెలుగు హిందీ ద్విభాషా చిత్రంగా 3- డీ టెక్నాలజీతో నిర్మించనున్నారు. అంతేకాకుండా తమిళం మలయాళం కన్నడతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి అనువాదం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాల తరవాత నిర్మాత భూషణ్ కుమార్ తో ప్రభాస్ చేస్తోన్న మూడో చిత్రం ‘ఆదిపురుష్’. 2021లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి 2022లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ”నా విజన్ ను గుర్తించి సినిమాలో భాగస్వామి అయినందుకు ప్రభాస్ కు ధన్యవాదాలు. నా కలల ప్రాజెక్టుకు భూషణ్ జీ సహకారం మర్చిపోలేను. ఇంతకముందు ప్రేక్షకులు చూడని సరికొత్త అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తాం” అని పేర్కొన్నారు. నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ”మేము నిర్మించే ప్రతి ప్రాజెక్టు విషయంలో మా మార్క్ ఉంటుంది. అయితే ‘ఆది పురుష్’ విషయంలో ఓం రౌత్ కథ చెప్పిన విధానం నచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును వదులుకోకూడదని అనుకున్నాం. చిన్నప్పటి నుంచి ఈ కథలను వింటూ పెరిగాం. అందుకే కథ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నా. బిగ్ స్క్రీన్ పై అద్భుత చిత్ర రాజాన్ని చూసేందుకు ప్రేక్షకులు సిద్ధం కావాలి” అని చెప్పుకొచ్చారు.