‘రాంగ్ గోపాల్ వర్మ’ టైటిల్ లోగో…!

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఈ మధ్య వరుసగా సెటైరికల్ మూవీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీకి సినిమాలతోనే బుద్ధి చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు అతన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసే వర్మపై రివేంజ్ తీర్చుకునే క్రమంలో ఇప్పటికే ”పరాన్నజీవి” మూవీని రిలీజ్ చేసారు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ”ఆర్జీవీ” (రోజూ గిల్లే వాడు) అనే సినిమా తీస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ”పార్న్ జీవి – పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ” ”ఎవడ్రా నన్ను కొట్టింది” ”రాడ్ గోపాల్ వర్మ” అనే మరో మూడు సినిమాలు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో లేటెస్టుగా ”రాంగ్ గోపాల్ వర్మ” అనే మరో సినిమా రానుంది.

కాగా పాత్రికేయుడు రచయిత దర్శకుడు ప్రభు ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. జబర్థస్త్ షకలక శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళా అభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు. ఇది ‘రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్న రైట్ డైరెక్టర్’ స్టోరీ అని పోస్టర్ లో వెల్లడించారు. వ్యక్తులను టార్గెట్ చేస్తూ తీసే సినిమాలకు తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులాంటి వ్యక్తిపై తీసిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని స్వాగతిస్తున్నానని.. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన పాట విన్నానని చాలా బాగుందని దేవి పేర్కొన్నారు. ఇక సమాజం కారణంగా మనుగడ సాగిస్తూ ఆ సమాజానికి జవాబుదారీ కాదని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రకటించుకునే వ్యక్తులను సంఘ బహిష్కరణ చేయాల్సి ఉందని ఆమె ప్రకటించారు. ఒక డైరెక్టర్ విపరీత చేష్టలకు చెంప పెట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని.. క్లైమాక్స్ సన్నివేశాలు.. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిందని ప్రభు చెప్పుకొచ్చారు.