Templates by BIGtheme NET
Home >> Cinema News >> నేలకు దిగని తారలు.. ఆకాశంలో పారితోషికాలు!

నేలకు దిగని తారలు.. ఆకాశంలో పారితోషికాలు!


ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా పారితోషికాలు తీసుకుంటున్న వారిలో పవన్ కల్యాణ్ మహేష్ ప్రభాస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారనేది టాక్. వకీల్ సాబ్ చిత్రానికి పవన్ రూ.65 కోట్ల వరకు తీసుకున్నట్టు టాక్. సర్కారు వారి పాటకు మహేష్ బాబు సైతం ఇంచుమించు అదే రేంజ్ లో ఉన్నాడట. ఇక బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కు హిందీ మార్కెట్ అడ్వాంటేజ్ కావడంతో.. వీళ్లిద్దరికన్నా ఓ మెట్టు ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. కరోనా సమయంలోనూ రెమ్యునరేషన్ ఏ మాత్రం తగ్గించుకునేందుకు హీరోలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. తాజాగా.. హీరో రామ్ పోతినేని సైతం భారీ పారితోషికం తీసుకోవడం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.

కరోనా ప్రభావం ఇండస్ట్రీపై ఏ రేంజ్ లో పడిందో తెలిసిందే. ఎప్పుడో మే లో రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ ల్యాబ్ లోనే మూలుగుతున్నాయి. వాటికి పెట్టిన కోట్లాది రూపాయల బడ్జెట్ కు వడ్డీలు కొండలా పెరిగిపోతుంటే నిర్మాతలు తల పట్టుకొని కూర్చున్నారు. టర్నోవర్ ఆగిపోవడంతో వందల కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి. ఈ పరిస్థితులు ఇంకా ఎప్పుడు చక్కబడతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలోనూ పారితోషికాలు తగ్గించుకునేందుకు ఎవ్వరూ సిద్ధపడట్లేదు. తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో.. ప్రొడక్షన్ కాస్ట్ కన్నా అధికంగా రెమ్యునరేషన్లకే సమర్పించుకోవాల్సిన పరిస్థితి.

అసలే తెలుగు సినిమా సక్సెస్ రేటు సగటున 2 నుంచి 3 శాతం కన్నా ఎక్కువగా నమోదుకాని పరిస్థితి. బడ్జెట్ బాహుబలి కొండలా అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ.. విజయాల శాతం మాత్రం పెరగడం లేదు. ఫలితంగా ఇండస్ట్రీ నష్టాల బాటలోనే పయనిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన కరోనా.. అన్ని రంగాలనూ అతలా కుతలం చేసింది. ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది. సినిమా ఇండస్ట్రీపైనా దీని ప్రభావం తీవ్రంగానే పడింది. ఎక్కడికక్కడ షూటింగులు నిల్చిపోయాయి.

దీంతో.. చిత్రపరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో పడ్డాయి. నిర్మాతలు కోట్లాది రూపాయలు వడ్డీలకు తెచ్చి పెట్టిన సినిమాలు మధ్యలో ఉన్నాయి. పూర్తైనవి కూడా స్టోర్ రూముల్లో మూలుగుతున్నాయి. ఇలాంటి దుస్థితిలో థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయో..? తెరుచుకున్నా.. ప్రేక్షకులు గతంలో మాదిరిగా వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ సమస్యలన్నీ పూర్తిగా క్లియర్ అయ్యి.. ప్రశాంతంగా బొమ్మ ఎప్పుడు పడుతుందో ఎవ్వరూ చెప్పలేకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. హీరోలు రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకోవాల్సిన అవసరమైతే చాలా ఉంది. అది నిర్మాతలకు ఊరటనివ్వడమే కాకుండా.. సినీ కార్మికులకు పరోక్షంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ చర్చ కరోనా మొదలైన కానుంచీ జరుగుతూనే ఉంది. కానీ.. అమల్లోకి మాత్రం రావట్లేదు. నాన్ థియేటర్ హక్కుల ఆదాయం పెరిగిందని చెబుతూ.. ఆ మేరకు రెమ్యునరేషన్లో లాగేస్తున్నారు హీరోలు టెక్నీషియన్లు.

తాజాగా.. రామ్ హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన లెక్కలు షాకిస్తున్నాయి. ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. అంతేకాదు.. అదనంగా మరో మూడు కోట్ల మేర లాభాల్లో వాటా తీసునోన్నట్టు సమాచారం. ఇక దర్శకుడు లింగు స్వామి కూ రూ.6 కోట్లు పుచ్చుకుంటున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ మూడున్నర కోట్లు హీరోయిన్ కృతిశెట్టి కోటి.. ఇలా మొత్తం నటులు టెక్నికల్ క్రూ మొత్తానికి కలిపి ఏకంగా 30 కోట్ల రూపాయలు పారితోషికంగానే పోతోందట. ప్రొడక్షన్ కాస్ట్ మరో పాతిక కోట్లు. వెరసి సినిమా మొత్తం పూర్తయ్యే నాటికి బడ్జెట్ యాభై కోట్లు కాబోతోందన్నమాట. ఈ విధంగా.. కరోనా కాలంలోనూ పారితోషికాలు పెంచుకుంటూ పోతుండడంతో.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదని క్రిటిక్స్ అంటున్నారు.